అమెరికా దాచిన నిజం?.. ఇరాన్ దాడులతో భారీ నష్టం!
- అమెరికా స్థావరాలకు భారీ నష్టం జరిగిందన్న నివేదిక
- బహ్రెయిన్‌లోని నౌకాదళ స్థావరానికి తీవ్ర దెబ్బ
- సైనిక స్థావరాల మార్పుపై పెంటగాన్ ఆలోచన
- పునర్నిర్మాణానికే 400 మిలియన్ డాలర్ల అంచనా
- మొత్తం యుద్ధ వ్యయం 40 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా
‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం.. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ మధ్య జరిగిన ఇరాన్ దాడుల్లో పశ్చిమాసియాలో కనీసం 20 అమెరికా సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నౌకాదళ ప్రధాన స్థావరం ‘నేవల్ సపోర్ట్ యాక్టివిటీ’కు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఈ దాడుల్లో కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు డజనుకు పైగా భవనాలు, రెండు శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినల్స్ దెబ్బతిన్నట్లు నివేదిక పేర్కొంది. దాడుల సమయంలో ఎక్కువ మంది సిబ్బందిని ముందుగానే తరలించినందున ప్రాణనష్టం జరగలేదని అమెరికా సైన్యం తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్‌లోని స్థావరాన్ని పునర్వ్యవస్థీకరించడం, కువైట్, సౌదీ అరేబియాల్లో ఉనికిని తగ్గించడం, ఇరాన్ క్షిపణుల పరిధికి దూరంగా కొన్ని సైనిక కార్యకలాపాలను పశ్చిమ ప్రాంతాలకు తరలించే అంశాలను పెంటగాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే భూగర్భ కమాండ్ కేంద్రాల ఏర్పాటుపైనా చర్చ జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
నష్టపోయిన భవనాల పునర్నిర్మాణానికే సుమారు 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,400 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. అయితే శిథిలాల తొలగింపు, అదనపు భద్రతా ఏర్పాట్ల ఖర్చు ఇందులో లేదని పేర్కొంది.
ఇదే సమయంలో ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ అంచనా ప్రకారం ఈ యుద్ధం వల్ల మొత్తం వ్యయం సుమారు 40 బిలియన్ డాలర్లకు చేరగా, అందులో 2.2 నుంచి 5.1 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సైనిక స్థావరాలకే నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది.