వీధులన్నీ ఖాళీ, ఇండోర్‌కు మారిన బడ్జెట్ ఫ్యాషన్.. మారిపోయిన సరోజినీ నగర్ ‘వైబ్స్’

Sarojini Nagar Market streets empty as budget fashion moves indoors and vibes change
  • ఆక్రమణల తొలగింపు చర్యలతో మారిన ఢిల్లీ సరోజినీ నగర్ మార్కెట్ రూపం
  • రోడ్లపై, గోడలకు బట్టలు వేలాడదీయడం, డిస్‌ప్లే రాక్‌లు పెట్టడంపై నిషేధం 
  • స్థానిక దుకాణాల్లో అద్దెకు స్థలాలు తీసుకుని ఇండోర్‌కు వ్యాపారుల షిఫ్ట్
  • మార్కెట్ క్లోజ్ ప్రచారంతో 20 శాతం మేర తగ్గిన వ్యాపారాలు  
ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ, బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ హబ్ 'సరోజినీ నగర్ మార్కెట్' రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. మార్కెట్‌లోని వీధుల ఆక్రమణలపై న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కఠిన చర్యలు చేపట్టడంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ ఇప్పుడు విశాలంగా మారి సరికొత్తగా కనిపిస్తున్నాయి. ఈ డ్రైవ్ వల్ల రోడ్లపై ఉండే వందలాది వీధి వ్యాపారులు తమ దుకాణాలను ఖాళీ చేశారు.

ఎన్‌డీఎంసీ నిబంధనల ప్రకారం.. మార్కెట్ వ్యాపారులు తమకు కేటాయించిన పరిమితిని దాటి రోడ్లపైకి గానీ, నడిచే దారుల్లోకి గానీ బట్టల రాక్‌లు, డిస్‌ప్లే స్టాండ్‌లు ఉంచడానికి వీల్లేదు. చివరికి సరోజినీ నగర్ మార్కెట్‌లో ఎంతో గుర్తింపు పొందిన 'గ్రాఫిటీ లేన్' గోడలకు కూడా బట్టలు వేలాడదీయడాన్ని అధికారులు పూర్తిగా నిషేధించారు. దీంతో ఎప్పుడూ ఊపిరాడనంత జనంతో కిక్కిరిసిపోయే వీధుల్లో ఇప్పుడు నడవడానికి దాదాపు రెట్టింపు స్థలం అందుబాటులోకి వచ్చింది. రోడ్లు ఖాళీ అవ్వడంతో జేబుదొంగతనాలు భారీగా తగ్గాయని అధికారులు చెబుతున్నారు.

అయితే, ఈ ఆకస్మిక మార్పులపై సోషల్ మీడియాలో భిన్నమైన రచ్చ నడుస్తోంది. సరోజినీ నగర్ మార్కెట్‌కు ఉన్న పాత 'వైబ్' పోయిందని, మార్కెట్ మొత్తం వెలవెలబోతోందని కొందరు కస్టమర్లు పోస్టులు పెడుతున్నారు. మార్కెట్ పూర్తిగా మూతపడిందనే వార్తల వల్ల కస్టమర్ల ఫుట్‌ఫాల్ దాదాపు 20 శాతం మేర తగ్గిందని, దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అయితే బడ్జెట్ షాపింగ్ లవర్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని, గతంలో రోడ్లపై దొరికే రూ.50 టాప్స్, రూ.100 జీన్స్, సన్ గ్లాసెస్ వంటివన్నీ ఇప్పుడు రోడ్ల పక్కనే ఉన్న షాపుల లోపల దొరుకుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ జరిగిన అగ్నిప్రమాదాలు, తొక్కిసలాటల వంటి భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకునే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో సరోజినీ నగర్ వచ్చే కస్టమర్లకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభూతిని అందించడమే ఈ డ్రైవ్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
Sarojini Nagar Market
NDMC Delhi
Delhi Budget Shopping
Street Vendors Drive
Graffiti Lane
Delhi Fashion Market

More Telugu News