ఎక్కువ రోజులు బతకాలంటే.. తొడలు బలంగా ఉండాలట!
- బలమైన తొడలు దీర్ఘాయుష్షుకు దోహదమంటున్న నిపుణులు
- రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగపడే తొడల కండరాలు
- మెదడు, గుండె ఆరోగ్యానికీ మేలు
- వారానికి 2-3 రోజులు కాళ్ల వ్యాయామాలను చేయాలని సూచన
- ప్రొటీన్, నీళ్లు, నిద్ర కూడా కీలకమే
వైద్యుల ప్రకారం.. శరీరంలోనే అతిపెద్ద కండరాలు తొడలు. ఇవి బలంగా ఉంటే దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తొడలు బలంగా ఉంటే రక్తంలోని గ్లూకోజ్‌ను ఎక్కువగా గ్రహిస్తాయి. దీంతో రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
బలమైన కాళ్ల కండరాలు జ్ఞాపకశక్తి, మెదడు పనితీరుకు కూడా తోడ్పడతాయి. అలాగే కాళ్ల నుంచి గుండె వైపు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా దోహదం చేస్తుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఈ ప్రయోజనాలు పొందాలంటే వారానికి కనీసం రెండు నుంచి మూడు రోజులు స్క్వాట్స్, లాంజెస్, కాఫ్ రైజెస్, డెడ్‌లిఫ్ట్స్ వంటి కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు నడక, సైక్లింగ్, పరుగులు, ప్రొటీన్ అధికంగా ఉండే సమతుల ఆహారం, తగినంత నీరు, సరిపడా నిద్ర కూడా అవసరమని చెప్పారు.