23 ఏళ్ల తర్వాత అమెరికాకు గుడ్ బై.. రూ.56 కోట్లున్నా మనశ్శాంతి కరవైందన్న ఎన్నారై

  • యూఎస్‌లో 23 ఏళ్లుగా నివసిస్తున్న ఓ ఎన్నారై భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయం
  • ఎన్ని విజయాలు సాధించినా ఇప్పటికీ 'పరాయి వాడినే' అనే భావన వెంటాడుతోందని ఆవేదన
  • వృద్ధాప్యంలో కుటుంబం, సమాజం అండగా ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం
  • ఎన్నారై పోస్ట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు.. భిన్నమైన సలహాలు
అమెరికాలో 23 ఏళ్లుగా నివసిస్తూ, అత్యంత విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఓ ఎన్నారై స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. సుమారు రూ.56 కోట్లు విలువైన సంపదను కూడబెట్టినప్పటికీ, ఆ దేశంలో తాను ఇప్పటికీ ఒక 'పరాయివాడినే' అనే భావన వెంటాడుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి, ప్రవాస భారతీయుల జీవితాల్లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.

ఆ ఎన్నారై తన రెడ్డిట్ పోస్ట్‌లో.. "నేను మొదట అమెరికాకు వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా ఫీలయ్యాను. ప్రపంచం నడిబొడ్డున అడుగుపెట్టినట్లు అనిపించింది. నేను భారతదేశంలో పెరిగిన ప్రదేశంతో పోలిస్తే, ఇక్కడి మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు ఎంతో ఉన్నతంగా అనిపించాయి. సంపాదనలో ఎక్కువ భాగం... జీతం, ఈక్విటీ కాంపెన్సేషన్, అమెరికన్ టెక్ స్టాక్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా వ‌చ్చాయి. ఈరోజు నా ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో విలువ సుమారు 6 మిలియన్ డాలర్లు. దీనికి అదనంగా మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఇంత సంపద ఉన్నప్పటికీ, భారత్‌కు తిరిగి వెళ్లాలనే ఆలోచన ఆర్థికపరమైనది కాదని స్పష్టం చేశారు. "ఇన్నేళ్లయినా నేను ఇక్కడ అప్పుడప్పుడు పరాయివాడిలాగే భావిస్తున్నాను. మాటల్లో చెప్పలేని ఒక అదృశ్య దూరం వెంటాడుతూనే ఉంది. నువ్వు ఎంత సాధించినా, ఈ ప్రదేశంలో పూర్తిగా భాగం కాలేకపోతున్నావనే భావన కలుగుతోంది" అని తన ఆవేదనను పంచుకున్నారు.

భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. "వయసు పైబడ్డాక అమెరికాలో నా జీవితం ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నాను. కుటుంబ బంధాలు, సామాజిక మద్దతు, మానసిక భద్రత వంటి విషయాల్లో నాకు ఇక్కడ పూర్తిస్థాయి భరోసా దొరుకుతుందనే నమ్మకం లేదు. నా సొంత దేశంలో లభించే సౌకర్యం ఇక్కడ అనుభవించగలనో లేదోననిపిస్తోంది" అని వివరించారు.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ, సొంత ఊరిలో దొరికే ఆనందం మరెక్కడా దొరకదని కామెంట్ చేశారు. "వెళ్లిపో బ్రదర్. బాగా సంపాదించావు. 6 మిలియన్ డాలర్లు చిన్న విషయం కాదు. నీ రిటైర్‌మెంట్ జీవితాన్ని ఆనందంగా గడుపు" అని ఒకరు రాశారు.

మరికొందరు మాత్రం ఆచరణాత్మక సలహాలు ఇచ్చారు. "మీరు ఎక్కడ నివసించినా, కష్టసుఖాలు పంచుకోవడానికి స్నేహితులు, కుటుంబం ముఖ్యం. అదే అసలైన బంధం" అని ఒకరు పేర్కొన్నారు. మరో యూజర్, "23 ఏళ్లలో భారత్ చాలా మారిపోయింది. ఏడాదికి రెండు వారాలు వచ్చి వెళ్లడం వేరు, శాశ్వతంగా ఇక్కడే ఉండటం వేరు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఓ ఆరు నెలల పాటు భారత్‌లో గడిపి చూడండి" అని సూచించారు. 

NRI
USA to India return
6 million dollar net worth
NRI mental peace
Reverse migration to India
Viral NRI Reddit post

More Telugu News