లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ.. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు

Andhra Pradesh as a logistics hub Chandrababu Naidu talks with Singapore companies
  • సింగపూర్‌కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం
  • ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి
  • రాష్ట్రంలో భారీ సప్లై చైన్ సిటీ ఏర్పాటుపై వైసీహెచ్‌ గ్రూప్‌తో చర్చలు
  • లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని వెల్లడి
  • రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను చూసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సింగపూర్‌కు చెందిన పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వారికి వివరించారు.

తన పర్యటనలో భాగంగా తొలిరోజు, ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ వైసీహెచ్‌ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ ఆటోమేటెడ్ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. లాజిస్టిక్స్ రంగానికి ఇది ఎంతో అనుకూలం. మాకు జాతీయ రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వేలతో అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించేందుకు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం" అని తెలిపారు.

రాష్ట్రంలోని ఇతర అవకాశాలను వివరిస్తూ.. "ఉద్యానవన రంగంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నాం. ఆక్వా సాగులో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఆహార ఉత్పత్తులకు విలువ జోడించి, వాటి ఎగుమతులను ప్రోత్సహించడమే మా లక్ష్యం. ఏపీలో అపార అవకాశాలున్నాయి, ఉత్పత్తి రంగంలోనూ పెట్టుబడులు పెట్టవచ్చు" అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఉన్న విధానాలు, అనుకూలతలను స్వయంగా పరిశీలించి పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానించారు.
Go Back to Shorts
Nara Chandrababu Naidu
Andhra Pradesh Logistics Hub
YCH Group Singapore
Andhra Pradesh Investment Opportunities
Supply Chain City AP
Sunil Nambiar

More Telugu News