అతడి వేతనం రూ.1.6 కోట్లు.. కానీ కాబోయే భార్య జీతంపై వింత షరతు!
- రూ.1.6 కోట్ల జీతం ఉన్న ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ పెళ్లి ప్రకటన
- తనతో సమానంగా సంపాదించే లేదా పూర్తిస్థాయి గృహిణి కావాలని షరతు
- మధ్యస్థాయి జీతం ఉన్న మహిళలు 'బ్యాడ్ డీల్' అంటూ తిరస్కరణ
- పెళ్లిని వ్యాపారంగా చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు
ఐఐటీ బాంబే, ఐఐఎం అహ్మదాబాద్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో అభ్యసించిన 34 ఏళ్ల ఈ యువకుడు, ఒక ప్రముఖ కన్సల్టింగ్ సంస్థలో అసోసియేట్ పార్ట్‌నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏడాదికి రూ.1.6 కోట్ల వేతనాన్ని అందుకుంటున్నాడు. వివాహ ప్రయత్నాల్లో భాగంగా అతను 'షాదీ డాట్ కామ్'లో తన ప్రొఫైల్‌ను నమోదు చేసుకోగా, అనేక సంబంధాలు వచ్చాయి. అయితే, ఆసక్తి కనబరిచిన మహిళల్లో మెజారిటీ వ్యక్తుల వార్షిక ఆదాయం రూ.6 లక్షల నుండి రూ.15 లక్షల మధ్య ఉండటమే కాకుండా, వారు వివాహానంతరం సంతానం కలిగినా కూడా తమ వృత్తిని కొనసాగించాలని భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదనలు తనకు 'బ్యాడ్ డీల్' అని సదరు యువకుడు అభిప్రాయపడ్డాడు. తనతో సమానంగా సంపాదిస్తూ ఆర్థిక, కుటుంబ బాధ్యతలను సమాంగా పంచుకునే భాగస్వామి అయినా కావాలని లేదా తన సంపాదనపై ఆధారపడుతూ పూర్తిస్థాయి గృహిణిగా ఉండే మహిళ అయినా కావాలని అతను స్పష్టం చేశాడు. ఒకవేళ తన భార్య తనకంటే ఎక్కువ సంపాదిస్తే, తాను ఉద్యోగం మాని ఇంటి వద్దే ఉంటూ పిల్లల బాధ్యతలను చూసుకోవడానికి కూడా సిద్ధమని ప్రకటించాడు. ఈ వివరాలను అతని స్నేహితుడైన కబీర్ మీనన్ అనే సైకాలజిస్ట్ జూన్ 11న 'ఎక్స్'వేదికగా పంచుకోవడంతో ఈ అంశం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పెళ్లిని ఒక వ్యాపార లావాదేవీలా మార్చేస్తున్నారని విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది ఆచరణాత్మకమైన ఆలోచనేనని సమర్థిస్తున్నారు. ముఖ్యంగా పెద్దలు కుదిర్చే వివాహాల్లో ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండటం అత్యవసరమని వారు వాదిస్తున్నారు.