ఆ ఒక్క నిర్ణయం.. భారత ఫుట్‌బాల్‌ను దశాబ్దాలు వెనక్కి నెట్టిందా?.. 76 ఏళ్ల నాటి చారిత్రక తప్పిదంపై చర్చ!
- 1950 ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన భారత జట్టు
- పాల్గొనే అవకాశాన్ని తిరస్కరించిన ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్
- భారత ఫుట్‌బాల్ స్వర్ణయుగంపై చెరగని చారిత్రక మచ్చ
- ప్రస్తుత వరల్డ్ కప్ నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చిన పాత గాయం
అప్రయత్నంగా వచ్చిన అర్హత... చేజేతులా వదులుకున్న వైనం
1950 వరల్డ్ కప్‌కు ఆసియా నుంచి జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బర్మా వంటి దేశాలు రెండో ప్రపంచ యుద్ధం అనంతర పరిణామాల కారణంగా తప్పుకోవడంతో, భారత జట్టుకు అప్రయత్నంగా అర్హత లభించింది. స్వీడన్, ఇటలీ, పరాగ్వేలతో కూడిన గ్రూప్-3లో భారత్‌కు చోటు దక్కింది. ఆ సమయంలో పరాగ్వేపై భారత్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండటంతో తర్వాతి దశకు చేరుకునేందుకు మార్గం సుగమంగానే కనిపించింది.
అయితే, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఈ అరుదైన ఆహ్వానాన్ని తిరస్కరించింది. ప్రయాణ ఖర్చులు, తగినంత సన్నద్ధత లేకపోవడం, జట్టు ఎంపికలో సమస్యలు, ఒలింపిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన వంటి కారణాలను చూపింది. ఆటగాళ్లు బూట్లు లేకుండా ఆడటం వల్లే వెళ్లలేదనే ప్రచారం ఉన్నప్పటికీ, అది ప్రధాన కారణం కాదని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. కెప్టెన్ సైలెన్ మన్నాతో సహా ఆటగాళ్లు బూట్లతో ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ, ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయం మారలేదు. ఫిఫా ప్రయాణ ఖర్చుల్లో సింహభాగాన్ని భరిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.
హైదరాబాద్ ఫుట్‌బాల్‌కు తీరని నష్టం
ఈ నిర్ణయం ముఖ్యంగా హైదరాబాద్ ఫుట్‌బాల్‌కు తీరని నష్టాన్ని మిగిల్చింది. అప్పట్లో భారత ఫుట్‌బాల్‌కు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ నేతృత్వంలో హైదరాబాద్ నగరమే ఒక నర్సరీగా ఉండేది. కేపీ ధన్‌రాజ్, సయ్యద్ ఖ్వాజా అజీజ్-ఉద్-దిన్, జీఎస్ లాయక్, అబ్దుల్ లతీఫ్, నూర్ మహమ్మద్ వంటి ఎందరో మేటి ఆటగాళ్లు హైదరాబాద్ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రహీమ్ శిక్షణలోనే 1951లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టు ఫైనల్‌లో ఇరాన్‌ను 1-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించింది. అలాంటి స్వర్ణయుగంలో ఉన్న జట్టు, వరల్డ్ కప్ ఆడలేకపోవడం భారత ఫుట్‌బాల్ అభిమానులకు ఇప్పటికీ ఓ పీడకలగానే మిగిలిపోయింది.
ఆ తర్వాత భారత్ మళ్లీ ఏనాడూ ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది. కానీ, ఒకప్పుడు మనతో పాటే ఉన్న జపాన్, ఇరాన్ వంటి ఆసియా దేశాలు ప్రపంచ ఫుట్‌బాల్‌లో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రస్తుతం 48 జట్లతో, బిలియన్ల కొద్దీ ప్రేక్షకుల ఆదరణతో సాగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌ను చూస్తున్నప్పుడు, 1950లో మనం వదులుకున్న ఆ అవకాశం ఎంత విలువైందో అర్థమవుతుంది. ఆ ఒక్క నిర్ణయం జరగకపోయి ఉంటే, భారత ఫుట్‌బాల్ చరిత్ర మరోలా ఉండేదేమోనన్న ఆవేదన క్రీడాభిమానుల్లో నేటికీ సజీవంగానే ఉంది.