వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల వెనుక భావోద్వేగ క‌థ‌!

Emotional story behind the rise of Vaibhav Suryavanshi
  • భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ 
  • ఈ ఘనతతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్
  • కొడుకు శిక్షణ కోసం పూర్వీకుల భూమిని అమ్మేసిన తండ్రి సంజీవ్
  • భూమి, డబ్బు కన్నా దేశ గౌరవమే గొప్పదంటున్న కుటుంబం
  • ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్
ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్ల కోసం స్టేడియాలు కిక్కిరిసిపోయేవి. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఇదే జాబితాలోకి మరో పేరు చేరబోతోంది. అతనే వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు సృష్టిస్తూ, భారత క్రికెట్‌లో సంచలనంగా మారాడు. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచి, సాక్షాత్తూ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లకు వైభవ్‌ను ఎంపిక చేశారు.

ఈ అద్భుత విజయం వెనుక అతని తండ్రి చేసిన అసామాన్య త్యాగం ఉంది. వైభవ్ క్రికెట్ శిక్షణ కోసం అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ తమ పూర్వీకుల భూమిని అమ్మేశారు. కొడుకు కలను సాకారం చేసేందుకు అంతకంటే మరో మార్గం కనిపించలేదని ఆయన చెబుతున్నారు. అయితే, ఇప్పుడు కొడుకు సాధిస్తున్న విజయాల ముందు ఆ త్యాగం చాలా చిన్నదని గర్వంగా అంటున్నారు. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ కాంట్రాక్ట్ ద్వారా వైభవ్ ఏటా రూ. 1.10 కోట్లు సంపాదిస్తున్నాడు.

ఈ విజయంపై వైభవ్ తండ్రి సంజీవ్ ఆనందం మాటల్లో చెప్పలేనిది. "మా కల నిజమైంది. ఇప్పుడు భూమి, డబ్బులకు ఏమాత్రం విలువ లేదు. దేశ విదేశాల్లో మా వాడికి వస్తున్న గౌరవం, గుర్తింపు చూసి మేం చాలా సంతోషంగా ఉన్నాం. నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. వైభవ్ సాధిస్తున్నది అన్నింటికంటే చాలా గొప్పది" అని ఆయన ఒక జాతీయ మీడియాతో అన్నారు. "చిన్నప్పటి నుంచి దేశం కోసం ఆడాలనే కల కోసం వైభవ్ చాలా కష్టపడ్డాడు. ఈ రోజు ఆ అదృష్టం అతనికి దక్కింది" అని గర్వంగా తెలిపారు.

"ఈ వార్త తెలిసినప్పుడు వైభవ్ శ్రీలంకలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాకు ఫోన్ చేసి, 'నాన్నా, నా సెలక్షన్ గురించి ఇప్పుడే తెలిసింది. తర్వాత మాట్లాడతాను' అని చెప్పాడు. అక్కడ అందరూ అతడిని అభినందిస్తున్నారు. మేం చాలా సంతోషంగా ఉన్నాం. మా కుటుంబం, మా ఊరు, యావత్ దేశం ఆనందంగా ఉంది. ఇది మాకు కలలా ఉంది" అని సంజీవ్ ఉద్వేగంగా చెప్పారు.

కొడుకు దేశం తరఫున ఆడబోయే ఆ మధుర క్షణాలను ప్రత్యక్షంగా చూసేందుకు వైభవ్ తల్లిదండ్రులు యూకే వెళ్లనున్నారు. ఇందుకోసం బీసీసీఐ నుంచి అవసరమైన పత్రాలు కూడా అందాయని సంజీవ్ తెలిపారు. "రికార్డులు బద్దలవ్వొచ్చు, కొత్తవి నెలకొల్పొచ్చు. కానీ, ఇది ఆరంభం మాత్రమే. అతను దేశం కోసం బాగా ఆడి ఉన్నత స్థాయికి చేరాలని దేవుడిని ప్రార్థిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
Vaibhav Suryavanshi
Indian Cricket Team
Sanjeev Suryavanshi
Rajasthan Royals
Sachin Tendulkar Record
India vs England T20

More Telugu News