కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై సస్పెన్స్.. గంభీర్‌ను కాదని బీసీసీఐ పెద్దల దగ్గరకు సీనియర్లు?
- వన్డే ప్రపంచకప్ భవిష్యత్తుపై స్పష్టత కోసం యత్నం
- రోహిత్, కోహ్లీల వన్డే లైనప్‌పై సస్పెన్స్
- వన్డే ప్రణాళికలపై ఇంకా దృష్టిపెట్టని గంభీర్
- డ్రెస్సింగ్ రూమ్‌లో గిల్ పట్టు సాధించాల్సి ఉంది
- వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 16 నెలలే
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2027 వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరూ ఆడతారా లేదా? అనే దానిపై కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. గంభీర్ కోచింగ్ శైలి, సెలక్టర్ల కఠినమైన డిమాండ్ల వల్లే సీనియర్లు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన కోహ్లీ.. ‘‘తాను మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం లేని స్థితిలో ఉన్నాను’’ అంటూ పరోక్షంగా తన అసంతృప్తిని వెల్లడించారు. మరోవైపు రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిలోనూ ఇప్పుడు మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్‌కు, సీనియర్ ఆటగాళ్లకు మధ్య పూర్తిస్థాయిలో అవగాహన కుదరలేదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక పేర్కొంది. ‘‘రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాలు జట్టులో ఉన్నప్పటికీ.. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ డ్రెస్సింగ్ రూమ్‌లో తన పట్టును నిరూపించుకోవాల్సి ఉంటుంది. గంభీర్ మిగతా రెండు ఫార్మాట్లలో శ్రద్ధ పెట్టినంతగా వన్డే ప్రణాళికల్లో ఇంకా దృష్టి సారించలేదు’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అయితే వన్డే ప్రపంచకప్‌నకు కేవలం 16 నెలల సమయం మాత్రమే ఉన్నందున.. గంభీర్, గిల్ కలిసి త్వరలోనే డ్రెస్సింగ్ రూమ్‌లో తమ ఆలోచనలను స్పష్టంగా పంచుకోవాల్సి ఉంటుంది. దశాబ్ద కాలంగా దేశానికి సేవ చేసిన సీనియర్ ఆటగాళ్లకు.. జట్టు యాజమాన్యం వారి నుంచి ఏం ఆశిస్తోంది? ప్రపంచకప్ రోడ్ మ్యాప్ ఏంటి? అనే విషయాలను సూటిగా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది నవంబర్ నాటికి విరాట్ కోహ్లీకి 38 ఏళ్లు, రోహిత్ శర్మకు 39 ఏళ్లు నిండనున్నాయి. వయసు రీత్యా వారి భవిష్యత్తుపై వస్తున్న ప్రశ్నలను గంభీర్, గిల్ బీసీసీఐ పెద్దలు ఎలా హ్యాండిల్ చేస్తారనే దానిపైనే రాబోయే వరల్డ్ కప్‌లో భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.