అమెరికాలో ఉద్యోగం, కోటి రూపాయల వార్షిక ప్యాకేజీ అనగానే చాలామందికి అద్భుతమైన జీవితం కళ్లముందు కదలాడుతుంది. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని న్యూయార్క్‌లో నివసిస్తున్న యష్ శర్మ అనే భారతీయ యువకుడు లెక్కలతో సహా వివరిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతను పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. 

యష్ శర్మ విశ్లేషణ ప్రకారం, న్యూయార్క్‌లో రూ.1 కోటి వార్షిక ప్యాకేజీతో జీవించడం కంటే, భారతదేశంలోని ఒక మంచి నగరంలో రూ.25-30 లక్షల జీతంతో మరింత సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితం గడపవచ్చు. దీనికి గల కారణాలను అతను స్పష్టంగా వివరించాడు. న్యూయార్క్‌లో ఫెడరల్, స్టేట్, సిటీ పన్నులతో పాటు ఇతరత్రా కోతలన్నీ కలిపి సంపాదనలో దాదాపు 35 శాతం నుంచి 40 శాతం వరకు పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. అంటే, కోటి రూపాయల జీతంలో సుమారు రూ.35-40 లక్షలు పన్నులకే పోతాయి.

ఇక ఇంటి అద్దెల విషయానికొస్తే, నగరంలోని ఒక మంచి ప్రాంతంలో నివసించాలంటే నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని యష్ పేర్కొన్నాడు. ఈ పన్నులు, అద్దెలు, రోజువారీ ఖర్చులన్నీ పోగా మిగిలేది చాలా తక్కువని అతను అంటున్నాడు.

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. "చాలామంది డాలర్లను రూపాయల్లోకి మార్చి చూస్తారు కానీ, అక్కడి ఖర్చులను పట్టించుకోరు" అని కొందరు యష్ వాదనను సమర్థిస్తున్నారు. అయితే, "న్యూయార్క్ అమెరికా మొత్తానికి ప్రాతినిధ్యం వహించదు, అక్కడ జీవన నాణ్యత మెరుగ్గా ఉంటుంది" అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, విదేశీ ప్యాకేజీలను అంచనా వేసేటప్పుడు కేవలం అంకెలను కాకుండా, 'కాస్ట్ ఆఫ్ లివింగ్' (జీవన వ్యయం)ను కూడా పరిగణనలోకి తీసుకోవాలనే కీలక విషయాన్ని ఈ వీడియో గుర్తుచేస్తోంది.