ఢిల్లీ పార్కులో అర్ధరాత్రి కూడా మనుషులు తిరుగుతుండడం చూసి దిగ్భ్రాంతికి గురైన మెక్సికో మహిళ
- ఢిల్లీ పార్కుల్లో అర్ధరాత్రి కుటుంబాల సందడి
- ఇది తనకు పెద్ద సాంస్కృతిక షాక్ అని చెప్పిన మెక్సికన్ మహిళ గాబ్రియేల్
- తీవ్రమైన వేసవి వల్లే ప్రజలు రాత్రిళ్లు బయటకు వస్తారని తెలుసుకొని మురిసిపోయిన వైనం
- భారతీయుడిని పెళ్లి చేసుకొని ఢిల్లీలో స్థిరపడిన గాబ్రియేల్
- ఆమె అనుభవం సోషల్ మీడియాలో వైరల్
గాబ్రియేల్ అనే మెక్సికన్ మహిళ, గౌరవ్ అనే భారతీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఢిల్లీలో స్థిరపడ్డారు. ఇటీవల ఓ రోజు రాత్రి తన భర్తతో కలిసి బయటకు వెళ్లిన ఆమె, అక్కడి దృశ్యం చూసి షాక్‌కు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఢిల్లీలోని పార్కుల్లో చిన్నపిల్లలు, పెద్దలతో సహా మొత్తం కుటుంబాలు ఎంతో సందడిగా గడుపుతుండటం ఆమెను ఆశ్చర్యపరిచింది.
ఈ విషయాన్ని వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. మెక్సికోలో గానీ, ఇతర దేశాల్లో గానీ అర్ధరాత్రి వేళ కుటుంబాలతో పార్కుల్లో గడపడం భద్రతా కారణాల దృష్ట్యా అంత సురక్షితం కాదని, కానీ ఇక్కడ ఇంత స్వేచ్ఛగా ఉండటం చూసి తనకు "కల్చరల్ షాక్" తగిలిందని ఆమె పేర్కొన్నారు.
అయితే, దీనికి కారణం ఢిల్లీలోని భరించలేని వేసవి అని ఆమె భర్త గౌరవ్ వివరించారు. పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటకు రాలేరని, అందుకే చల్లబడిన తర్వాత రాత్రిపూట కుటుంబంతో కలిసి ఇలా పార్కుల్లో సేద తీరుతారని తెలిపారు. ఈ వివరణతో గాబ్రియేల్ మరింత ఆసక్తికి లోనయ్యారు. ఇక్కడి ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా తమ జీవనశైలిని మార్చుకోవడం చాలా బాగుందని ఆమె ప్రశంసించారు. వృత్తిరీత్యా సైకాలజిస్ట్, కంటెంట్ క్రియేటర్ అయిన గాబ్రియేల్, గౌరవ్‌తో కలిసి @desimetmexi అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీని నడుపుతున్నారు. వీరిద్దరూ ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమవడం విశేషం.