విశాఖ-కాకినాడ తీరంలో భారీ కెమికల్ ప్లాంట్.. రష్యా దిగ్గజానికి లోకేష్ ఆహ్వానం

Nara Lokesh invites Russian Chemical Giant Ruschem Group to AP
  • రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్
  • ప్రముఖ రసాయన సంస్థ రస్ కెమ్ గ్రూప్‌తో కీలక సమావేశం
  • విశాఖ-కాకినాడ తీరంలో కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆహ్వానం
  • పోర్టు ఆధారిత లాజిస్టిక్స్ హబ్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి
  • లోకేష్ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో చర్చిస్తామన్న రస్ కెమ్ ప్రతినిధులు
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, మాస్కోలో కీలక సమావేశం నిర్వహించారు. రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, మిథనాల్ కెమికల్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ రస్ కెమ్ గ్రూప్ (Ruschem Group) డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్, అంతర్జాతీయ వ్యాపార విభాగాధిపతి దర్యా అషానియాలతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, పలు కీలక ప్రతిపాదనలను వారి ముందుంచారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, "భారత్ దిగుమతి చేసుకునే పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్‌ను ప్రాసెస్ చేసేందుకు వీలుగా, భారత తూర్పు తీరంలోని విశాఖ-కాకినాడ పీసీపీఐఆర్ (PCPIR) పరిధిలో రస్ కెమ్ ఆధ్వర్యంలో ఒక అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి" అని ఆహ్వానించారు. పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్‌ల నిర్మాణం, బల్క్ కెమికల్ స్టోరేజీ వసతులు, ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్త్‌ల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. 

అంతేకాకుండా, ఏపీలో అందుబాటులో ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుని ఒక కొలాబరేటివ్ పాలిమర్ అప్లికేషన్, మెటీరియల్ సైన్స్ పరిశోధన కేంద్రాన్ని (R&D Center) స్థాపించాలని సూచించారు. రస్ కెమ్ టెక్నాలజీతో పునరుత్పాదక ఇంధన కారిడార్లను అనుసంధానిస్తూ, తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే రసాయనాల తయారీ యూనిట్‌ను నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్ సానుకూలంగా స్పందించారు. భారత్‌లో ప్రత్యేక ఎస్‌పీవీల (SPV) ద్వారా హోల్‌సేల్ కెమికల్ పంపిణీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని, ఇప్పటికే ముంబై, కాన్పూర్‌లలోని పంపిణీ కేంద్రాల ద్వారా పరిశ్రమలకు అవసరమైన రసాయనాలను సరఫరా చేస్తున్నట్లు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ సరఫరా కేంద్రం ద్వారా విశాఖపట్నం, కాకినాడలోని ఫార్మా, తయారీ పరిశ్రమలకు కీలక రసాయనాలను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని భారీ పెట్రోకెమికల్ ప్లాంట్లను ఉపయోగించుకుని తమ గ్లోబల్ ఖాతాదారులకు స్థిరమైన సరఫరా అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనలు ఆశాజనకంగా ఉన్నాయని, వీటిపై తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తామని ఇల్యా కోసిహ్ తెలిపారు.
Go Back to Shorts
Nara Lokesh
Ruschem Group
Chemical Plant
Russia Tour
TDP
Andhra Pradesh

More Telugu News