భార్యపై కోపంతో ఓ వ్యక్తి నాటు తుపాకీతో హల్ చల్ చేయడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురైన ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నం సౌత్ మండలం పరిధిలోని కోన గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోన గ్రామానికి చెందిన రామాంజనేయులుకు, అతని భార్యకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన అతను, ఇంట్లో దాచిన నాటు తుపాకీని బయటకు తీసి భార్యను బెదిరించాడు. అంతటితో ఆగకుండా, లోడ్ చేసి ఉన్న ఆ తుపాకీతోనే గ్రామ ప్రధాన రహదారిపైకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న మచిలీపట్నం పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడు రామాంజనేయులును అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న లైసెన్స్ లేని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు అతనికి ఈ తుపాకీ ఎలా వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.