జిందాల్‌ ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Visits Jindal Waste to Energy Plant
  • నాయుడుపేటలోని జిందాల్ ప్లాంట్‌లో చెత్త నుంచి విద్యుత్ తయారీ
  • ఉత్పత్తి, వ్యయం తదితర వివరాలను తెలుసుకున్న పవన్ కల్యాణ్
  • కాకినాడ జిందాల్ ప్లాంట్ పై ఆరా తీసిన డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిందాల్‌ ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ (చెత్త నుంచి విద్యుత్ తయారుచేసే) ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు.


ప్లాంట్ ప్రతినిధులతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అవుతున్న వ్యయం, ప్లాంట్ రోజువారీ నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఎంత? అలాగే యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలు ఏంటి? అనే అంశాలను ప్లాంట్ ప్రతినిధులు ఉపముఖ్యమంత్రికి వివరంగా వివరించారు.


ఈ పర్యటనలో కాకినాడలో నిర్మిస్తున్న జిందాల్ ప్లాంట్ ఆలస్యంపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాకినాడ జిందాల్ ప్లాంట్ ఇంకా ఎందుకు వినియోగంలోకి రాలేదని ఆయన ప్రశ్నించగా... రాబోయే నవంబరు లోపు ఆ ప్లాంట్‌ను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని జిందాల్ ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు హామీ ఇచ్చారు.


పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా.. ఇటువంటి విద్యుత్ ప్లాంట్ల వల్ల పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఏ మేరకు పెరుగుతోంది, దాన్ని అదుపు చేయడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. దీనిపై జిందాల్ ప్రతినిధులు స్పందిస్తూ.. కాలుష్య నియంత్రణ మండలి ఏడాదికి నాలుగుసార్లు ప్లాంట్‌ను పరిశీలించి నివేదిక ఇస్తోందని ఉపముఖ్యమంత్రికి వివరించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh
Waste to Energy
Jindal Plant
Nellore
Naidupeta
Kakinada
Electricity Generation
Pollution Control

More Telugu News