చాలా మంది తమ జీవితంలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడానికి ఏదో ఒక పెద్ద తప్పిదం కారణమని భావిస్తారు. కానీ వాస్తవానికి మనం నిత్యం గమనించకుండా పునరావృతం చేసే చిన్న అలవాట్లే మన ఎదుగుదలను అడ్డుకుంటున్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాజం గొప్పగా చూసే కొన్ని అలవాట్లు కూడా మనల్ని మానసికంగా అలసిపోయేలా చేసి జీవితంలో ముందుకు సాగకుండా వెనక్కి లాగుతున్నాయి.

ఆ 11 అలవాట్లు ఇవే...

1. బిజీగా బతకడాన్ని గొప్పగా చెప్పుకోవడం: రాత్రి తక్కువ సమయం పడుకోవడం, నిరంతరం ఒత్తిడితో బతకడాన్ని ఒక హోదాగా చెప్పుకోవడం ఒక పెద్ద భ్రమ. ఇది మీ శరీరం ఇస్తున్న ప్రమాద సంకేతం.

2. ‘మూడ్’ కోసం ఎదురుచూడటం: ప్రేరణ వచ్చినప్పుడే పని మొదలుపెట్టాలి అనుకోవడం వల్ల పనులు వాయిదా పడతాయి. చిన్నగానైనా సరే పని మొదలుపెడితే వేగం దానంతట అదే వస్తుంది.

3. ప్రతిదానికీ ‘యెస్‌’ చెప్పడం: మొహమాటానికి పోయి ప్రతిదానికీ ‘అవును’ అనడం వల్ల మీ ప్రశాంతత దెబ్బతింటుంది. మర్యాదగా ‘నో’ చెప్పడం నేర్చుకోవడం మీ సమయాన్ని కాపాడుతుంది.

4. ఇతరులతో పోల్చుకోవడం: సోషల్ మీడియా కేవలం ఇతరుల జీవితంలోని బెస్ట్ మూమెంట్స్ మాత్రమే చూపించే మ్యూజియం. మీ తెరవెనక కష్టాలను వారి షోఆఫ్‌తో పోల్చుకోవద్దు.

5. ప్రతి తప్పును ఆపాదించుకోవడం: ఓ పనిలో ఫెయిల్ అయితే ‘నేనే ఒక ఫెయిల్యూర్’ అని ఫిక్స్ అయిపోవడం వల్ల కొత్త పనులు చేయడానికి భయం వేస్తుంది. తప్పులు కేవలం పాఠాలు మాత్రమే.

6. పర్ఫెక్ట్‌గా ఉండాలని పట్టుబట్టడం: పర్ఫెక్ట్‌ ప్లాన్ లేదా సరైన సమయం కోసం ఎదురుచూడటం అనేది ఓడిపోతామనే భయానికి ఇంకో రూపం. రంగంలోకి దిగి, తప్పులు చేస్తూ వాటిని సరిదిద్దుకోవాలి.

7. రీల్స్ చూస్తూ రెస్ట్ అనుకోవడం: గంటల తరబడి సోషల్ మీడియా స్క్రోల్ చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవ్వదు. మరింత అలసిపోతుంది. ఫోన్ లేకుండా గడపడమే నిజమైన విశ్రాంతి.

8. కష్టమైన సంభాషణలను దాటవేయడం: ఎదుటివారితో వచ్చే సమస్యలను మాట్లాడకుండా దాటవేస్తే అవి లోపల అలాగే ఉండిపోయి భవిష్యత్తులో బంధాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉంది.

9. టు-డూ లిస్ట్‌తో ముడిపెట్టడం: రోజంతా పనులు చేస్తూనే ఉండాలనుకోవద్దు. ఖాళీగా కూర్చుంటే అపరాధభావం కలగడం తప్పు. మీరు మనిషి. ఫ్యాక్టరీలో వస్తువులు తయారు చేసే మెషీన్‌ కాదు.

10. అందరికీ అందుబాటులో ఉండటం: ఆఫీస్ పనికైనా, ఫ్రెండ్స్‌కైనా 24 గంటలూ అందుబాటులో ఉండటం వల్ల మీ శక్తి హరించుకుపోతుంది. మీకంటూ కొన్ని సరిహద్దులు గీసుకోవాలి.

11. చిన్న పనులే... కానీ!: రోజుకు 10 నిమిషాలు నడవడం లేదా పుస్తకం చదవడం వల్ల అప్పటికప్పుడు ఫలితం కనిపించకపోవచ్చు. కానీ ఏడాది పాటు వీటిని కొనసాగిస్తే జీవితంలో ఊహించని పెద్ద విజయాలు వస్తాయి.