బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 60 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్‌తో యువ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇంత వయసులోనూ ఆయన తన శరీరాన్ని అంత పర్‌ఫెక్ట్‌గా ఎలా మెయింటెయిన్ చేస్తున్నారనేది చాలా మందికి ఆసక్తి కలిగించే విషయం. తాజాగా వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ తన డైట్, "చీట్ మీల్స్" వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నారు.

"నాకు ప్రతీ రోజూ చీట్ డేనే. కఠినమైన డైటింగ్ చేసి ఇష్టమైనవి తినకుండా ఉండటం కంటే, కాస్త ఎక్కువ తిని ఆ తర్వాత జిమ్‌లో ఎక్కువ సేపు కష్టపడటానికే నేను ఇష్టపడతాను" అని సల్మాన్ తెలిపారు. తనకు ఉడికించిన ఆహారం (steamed food) తినడం అస్సలు నచ్చదని స్పష్టం చేశారు.

ఆయన తన ఆహారంలో పరిమాణంపై (portion control) చాలా కఠినంగా ఉంటారు. "నేను కేవలం ఒక టేబుల్‌స్పూన్ అన్నం మాత్రమే తింటాను. రోటీలను అస్సలు ముట్టుకోను. ఆ కొద్దిపాటి కార్బోహైడ్రేట్‌లతో పాటు నాకు అవసరమైన ప్రొటీన్ కోసం చికెన్, మటన్ లేదా చేపలు తీసుకుంటాను" అని వివరించారు. తనకు ఇష్టమైనవి తిన్నా, అతిగా మాత్రం తిననని సల్మాన్ పేర్కొన్నారు.

ఎక్కువగా తన తల్లి సల్మా ఖాన్ వండిన ఇంటి భోజనాన్నే (ఘర్ కా ఖానా) ఇష్టపడతానని, బయటి ఫుడ్‌కు దూరంగా ఉంటానని చెప్పారు. ఉదయం అల్పాహారంలో గంజి, గుడ్లు, పండ్లు తీసుకుంటారు. ఇక మధ్యాహ్నం, రాత్రి భోజనంలో ఇంట్లో వండిన చేప లేదా చికెన్, కూరగాయలు, సలాడ్లు ఎక్కువగా ఉంటాయి. తనకు బిర్యానీ అంటే చాలా ఇష్టమని, కానీ కేలరీలను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా తింటానని, భోజనంతో పాటు తినడానికి ఉల్లిపాయ పచ్చడిని కూడా తనే స్వయంగా చేసుకుంటానని సల్మాన్ చెప్పుకొచ్చారు. 

ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానేయకుండా, క్రమశిక్షణతో ఆస్వాదించడమే తన ఫిట్‌నెస్ రహస్యమని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.