కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు లష్కరే సరికొత్త వ్యూహం!

Lashkar e Taiba New Strategy to Create Riots in Kashmir
  • పీఓకే సరిహద్దుల్లో లాంచ్‌ప్యాడ్‌ల సంఖ్య పెంచేందుకు కుట్ర
  • చొరబాట్ల కోసం సరిహద్దుల్లో 500 మంది ఉగ్రవాదులు
  • పాక్ రాజకీయ నేతలతో హఫీజ్ సయీద్ కుమారుడి భేటీలు
  • పీఓకేలో అభివృద్ధి నిరసనల నుంచి దృష్టి మళ్లించేందుకే ఎత్తుగడ
కశ్మీర్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి అలజడి సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ సరికొత్త కుట్రలకు తెరలేపింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ల సంఖ్యను పెంచడం, అదే సమయంలో ప్రచార యుద్ధాన్ని ఉద్ధృతం చేయడం అనే ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు పాక్ రాజకీయ ప్రముఖులతో లష్కరే అగ్రనాయకత్వం వరుసగా జరుపుతున్న భేటీలు భారత ఏజెన్సీల నిఘాలో పడ్డాయి.

చొరబాట్ల కోసం 500 మంది
ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడటానికి పీఓకే సరిహద్దుల్లో దాదాపు 500 మందికి పైగా లష్కరే ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల భారత భద్రతా దళాల అప్రమత్తత కారణంగా ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలన్నీ విఫలమవడంతో లష్కరే నాయకత్వం తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లాంచ్‌ప్యాడ్‌ల సంఖ్యను పెంచి, అక్కడ ఉగ్రవాదుల సంఖ్యను వెయ్యికి చేర్చాలని పీఓకేలో జరిగిన ఓ కీలక సమావేశంలో లష్కరే నిర్ణయించినట్లు  గుర్తించారు.

వ్యూహం మార్చిన ఉగ్రసంస్థ
భారత సైన్యాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేయడమే లక్ష్యంగా చొరబాటు యత్నాల సంఖ్యను అనేక రెట్లు పెంచాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 26 మంది ప్రాణాలు బలిగొన్న పహల్గామ్ దాడికి లష్కరే అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ కారణం కాగా.. ఆ తర్వాత భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో మురిద్కేలోని లష్కరే ప్రధాన శిక్షణా కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికే ఉగ్రవాదులు ఇప్పుడు మళ్లీ యత్నిస్తున్నారు.

రాజకీయ నేతలతో భేటీలు
లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ గత వారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యంత ఆప్తుడైన రాణా సనావుల్లాతో భేటీ కావడం సంచలనం సృష్టించింది. ఈ సమావేశంలో లష్కరే కొత్త ప్లాన్స్, లీడర్‌షిప్ మార్పుల గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌ను కేవలం సిద్ధాంతకర్తగా ఉంచి, యువకుడైన తల్హా సయీద్ సంస్థ బాధ్యతలు అధికారికంగా చేపట్టాలని పాక్ పాలకవర్గం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోవైపు పీఓకే మాజీ ప్రధాని సర్దార్ అతీక్ అహ్మద్ ఖాన్‌తో కూడా తల్హా సయీద్ భేటీ అయ్యాడు. లాంచ్‌ప్యాడ్‌ల విస్తరణకు అవసరమైన మౌలిక వసతుల మద్దతును అతణ్ని అడిగినట్లు సమాచారం.

ప్రజల దృష్టి మళ్లించేందుకే
ప్రస్తుతం పీఓకేలో అభివృద్ధి లేకపోవడంపై అక్కడి స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి కశ్మీర్ సెంటిమెంట్‌ను వాడుకోవాలని లష్కరే భావిస్తోంది. ఎన్నికల ప్రచారమంతా కశ్మీర్ అంశం చుట్టూనే తిరిగేలా చేస్తే ప్రజలు అభివృద్ధిని మరిచిపోతారని ఉగ్రనాయకత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు నిఘా అధికారులు విశ్లేషిస్తున్నారు.
Go Back to Shorts
Lashkar-e-Taiba
Kashmir
POK
Pakistan
Terrorism
Talha Saeed
Hafiz Saeed
India
Shehbaz Sharif
Sardar Ateeq Ahmed Khan

More Telugu News