సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 'ఎన్నారై డ్రీమ్' అనేది కొందరి మహిళల పాలిట ఎలా ఉచ్చుగా మారుతుందో వివరిస్తూ ఓ ఎక్స్ యూజర్ (@deebayleaf) పెట్టిన పోస్ట్, ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లాలనుకునే అమ్మాయిలకు ఒక హెచ్చరికలా మారింది.

ఆ పోస్ట్ ప్రకారం, ఆమె కజిన్ ఒక ఎన్నారైని వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లింది. అయితే, అక్కడ ఆమె తీవ్రమైన ఒంటరితనాన్ని ఎదుర్కొంది. రోజంతా ఇంటి పనులతో '24 గంటలూ పనిచేసే జీతం లేని సేవకురాలి'గా మారిపోయింది. పరిశుభ్రమైన రోడ్లు, స్వచ్ఛమైన గాలి వంటి ఆకర్షణలు కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయాయి. దీనికి తోడు, భారతీయ సంస్కృతిలో భాగంగా ఉండాలంటూ అత్తమామలు అదనపు పనులు చెబుతూ వేధించారు. చివరికి ఆ బంధం నుంచి బయటపడి ఆమె తిరిగి భారత్‌కు వచ్చేసింది.

ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో భారత్‌లోలాగా ఇంటి పనులకు మనుషులు చౌకగా దొరకరని, సొంత పనులు చేసుకోవడం తప్పదని కొందరు కామెంట్ చేశారు. అయితే, అక్కడి భర్తలు ఇంటి పనుల్లో భార్యలకు సహాయం చేస్తారని, కానీ కొన్ని ఎన్నారై కుటుంబాల్లో అలా జరగదని మరికొందరు వాదిస్తున్నారు. కుటుంబ పరువు, సామాజిక ఒత్తిళ్ల కారణంగా చాలామంది మహిళలు ఇలాంటి విషయాలను బయటకు చెప్పకుండా మౌనంగా భరిస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.

ఎన్నారై వివాహాలు మెరుగైన జీవనశైలిని, హోదాను ఇస్తాయని చాలా కుటుంబాలు భావిస్తాయి. కానీ, వీసా పరిమితులు, సాంస్కృతిక ఒంటరితనం, మద్దతు లేకపోవడం వంటి వాస్తవాలు చాలామందికి తెలియవు. ఆర్థికంగా, వీసా పరంగా భర్తపై ఆధారపడటం వల్ల సంబంధం దెబ్బతిన్నప్పుడు మహిళలకు ప్రమాదం ఎక్కువ. అందుకే, పెళ్లికి ముందే అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహనకు రావడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.