'12th ఫెయిల్' ఐపీఎస్ మనోజ్ శర్మకు కీలక పదవి.. ఇకపై ఆయన చేతిలోనే ముంబై లా అండ్ ఆర్డర్!

12th Fail IPS Manoj Kumar Sharma Gets Key Mumbai Post
  • ముంబై లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ 
  • '12th ఫెయిల్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియల్ హీరో మనోజ్ శర్మ
  • మహారాష్ట్ర హోం శాఖ చేపట్టిన భారీ బదిలీల్లో భాగంగా ఈ నియామకం 
  • రాష్ట్రవ్యాప్తంగా 50 మందికి పైగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
  • ముంబై, పుణె సహా పలు కీలక విభాగాలకు కొత్త అధికారుల నియామకం
'12th ఫెయిల్' చిత్రంతో దేశవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ముంబై నగర శాంతిభద్రతల విభాగం (లా అండ్ ఆర్డర్) జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. దేశ ఆర్థిక రాజధానిలో శాంతిభద్రతల పర్యవేక్షణకు సంబంధించిన ఈ కీలక బాధ్యతలను ఆయన చేపట్టనున్నారు. మహారాష్ట్ర హోం శాఖ రాష్ట్రవ్యాప్తంగా 50 మందికి పైగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ, ప్రమోషన్లు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో భాగంగా ఈ నియామకం జరిగింది.

2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన మనోజ్ కుమార్ శర్మ, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత పోలీసు అధికారిగా ఎదిగిన ఆయన జీవితం ఆధారంగా '12th ఫెయిల్' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఆయన జాతీయ స్థాయిలో ఫేమ‌స్ అయ్యారు. గతంలో ఆయన మహారాష్ట్ర స్టేట్ లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేశారు. అంతకుముందు ముంబైలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 1), వెస్ట్రన్ రీజియన్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా కూడా సేవలు అందించారు. అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌)లోనూ పనిచేశారు.

మహారాష్ట్ర పోలీస్ యాక్ట్, 1951 నిబంధనల ప్రకారం రాష్ట్రంలో శాంతిభద్రతలను బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ భారీ బదిలీలను చేపట్టారు. ఈ మార్పుల్లో భాగంగా ప్రస్తుత జాయింట్ సీపీ (లా అండ్ ఆర్డర్) సత్యనారాయణ్ చౌదరిని జాయింట్ సీపీ (ట్రాఫిక్)గా బదిలీ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ మాజీ జాయింట్ సీపీ లఖ్మీ గౌతమ్‌కు పదోన్నతి కల్పించి, మహారాష్ట్ర స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్)గా నియమించారు.

ఇతర ముఖ్యమైన మార్పులలో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజేష్ ప్రధాన్‌ను ముంబై పోలీస్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) జాయింట్ కమిషనర్‌గా నియమించారు. ఫోర్స్ వన్ మాజీ చీఫ్ కృష్ణ ప్రకాష్‌ను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రైనింగ్)గా బదిలీ చేశారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్‌)లో పరంజిత్ సింగ్ దహియా స్పెషల్ ఐజీగా పదోన్నతి పొందారు. సంజయ్ దరడేను పుణె జాయింట్ కమిషనర్‌గా, రంజన్ శర్మను కొల్హాపూర్ రేంజ్ స్పెషల్ ఐజీగా నియమించారు. వీరితో పాటు పలువురు డీసీపీ స్థాయి అధికారులకు కూడా కొత్త బాధ్యతలు అప్పగించారు.


Go Back to Shorts
Manoj Kumar Sharma
IPS Manoj Sharma
12th Fail
Mumbai Police
Law and Order
Maharashtra Police
Mumbai Crime Branch
Satyanarayan Choudhary
Maharashtra State Law
IPS Transfer

More Telugu News