తమిళనాడులో టీవీకే ప్రభంజనం... 'విజిల్' వేసిన విజయ్ ఫ్యామిలీ

Vijay TVK Party Victory Celebrations in Tamil Nadu
  • తొలి ఎన్నికలోనే 234 స్థానాలకు గాను 111 స్థానాల్లో ఆధిక్యంలో టీవీకే
  • మేజిక్ ఫిగర్‌కు 8 సీట్ల దూరంలోనే విజయ్ పార్టీ
  • పార్టీ గుర్తు 'విజిల్' విస్తూ, విక్టరీ గుర్తు చూపిస్తూ కుటుంబ సభ్యుల ఆనందం
తమిళనాడులో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుత విజయం దిశగా పయనిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా ఆ పార్టీ ఆధిక్యం పరంగా మేజిక్ ఫిగర్ సమీపానికి వచ్చింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు 118. మధ్యాహ్నం రెండు గంటల వరకు వచ్చిన ఫలితాలను చూస్తే, టీవీకే 111, అన్నాడీఎంకే 63, డీఎంకే 59 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

టీవీకే ప్రభంజనంతో విజయ్ కుటుంబ సభ్యులందరూ కలిసి పార్టీ గుర్తు అయిన 'విజిల్' వేస్తూ సంబరాలు చేసుకున్నారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ సోఫాలో కూర్చుని విజిల్ వేస్తూ, విక్టరీ గుర్తు చూపిస్తూ గెలుపు ఆనందాన్ని పంచుకున్నారు. విజయ్ కుటుంబంలో పిల్లలు, పెద్దలు ఓ రేంజిలో డ్యాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను యాక్టర్ విజయ్ టీమ్ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. విజయ్ నివాసం వెలుపల అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డ్యాన్సులు చేస్తూ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.

టీవీకే ప్రభావం డీఎంకే కూటమి పైనే పడింది. 2021లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 159 సీట్లు గెలుచుకోగా, ఈసారి దాదాపు 100 సీట్లు తగ్గిపోయాయి. అన్నాడీఎంకే కూటమికి గతంలో కంటే 12 సీట్లు తగ్గాయి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీవీకే పార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం. ఈ నేపథ్యంలో విజయ్ నివాసం వద్ద కోలాహలంగా ఉంది.


Advertisement
Vijay
TVK party
Tamil Nadu election results
Tamil Nadu Assembly
DMK
AnnaDMK
Tamil Nadu politics

More Telugu News