బీజేవైఎం నేత హత్య కేసు: ఆరుగురికి మరణశిక్ష విధించిన కోర్టు

Ktaka Death penalty awarded to 6 in BJP Yuva Morcha leader murder case
  • బీజేపీ యువమోర్చా నేత వెంకటేశ్ కురుబర హత్య కేసులో సంచలన తీర్పు
  • ఆరుగురు దోషులకు మరణశిక్ష విధించిన గంగావతి కోర్టు
  • దోషులకు రూ. 3 లక్షల చొప్పున జరిమానా
  • వ్యక్తిగత కక్షల కారణంగా గతేడాది హత్య 
కర్ణాటకలో సంచలనం సృష్టించిన బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) నేత వెంకటేశ్ కురుబర (34) హత్య కేసులో స్థానిక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురు దోషులకు మరణశిక్ష విధిస్తూ కొప్పల్ జిల్లా గంగావతి కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

గంగావతి కోర్టు జడ్జి సదానంద నాగప్ప నాయక్ ఈ తీర్పును ప్రకటించారు. దోషులుగా తేలిన రవి, విజయ్, ధనరాజ్, భరత్, సలీం మహమ్మద్ రఫీక్, గంగాధర గౌళికి మరణశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున జరిమానా విధించారు. తీర్పు నేపథ్యంలో గంగావతి కోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

2025 అక్టోబర్ 7న గంగావతి పట్టణంలో వెంకటేశ్ కురుబర దారుణ హత్యకు గురయ్యారు. ఓ కార్యక్రమం ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తున్న వెంకటేశ్‌ను కారుతో ఢీకొట్టిన దుండగులు, అనంతరం మారణాయుధాలతో అత్యంత కిరాతకంగా దాడి చేసి చంపేశారు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2003 నాటి ఒక పాత కేసులో వెంకటేశ్ పోలీసులకు సహకరించడంతో ప్రధాన నిందితుడు రవి పగ పెంచుకుని ఈ హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్టు చేయగా, పోలీసులు 927 పేజీల ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. విచారణలో భాగంగా 83 మంది సాక్షులను విచారించిన కోర్టు, సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆరుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, మిగిలిన ఆరుగురిని దోషులుగా నిర్ధారించింది.
Go Back to Shorts
Karnataka
Death Penalty
BJYM
Court
Venkatesh Kurubara
Gangavathi
BJP

More Telugu News