వేగం పెంచిన ‘ధర్మన్’.. సెకండ్ షెడ్యూల్‌లో అడుగుపెట్టిన రజనీకాంత్

Dharman speeds up as Rajinikanth enters the second schedule
  • సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ నేడు రెండో షెడ్యూల్ ప్రారంభం
  • కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం
  • సెట్స్ పై రజనీ ఉన్న వీడియో క్లిప్ విడుదల చేసిన మేకర్స్
  • అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మూవీ
  • నేరస్థులను ఎదుర్కొనే డాక్టర్ పాత్రలో కనిపించనున్న రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధర్మన్’ సినిమా షూటింగ్ వేగం పుంజుకుంది. ఈ చిత్రం రెండో షెడ్యూల్ చిత్రీకరణ నేడు ప్రారంభమైనట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను సీనియ‌ర్‌ నటుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

షూటింగ్ ప్రారంభంపై చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియో క్లిప్‌ను పంచుకుంది. "ది డెడ్లీ డాక్టర్.. ‘ధర్మన్’ షెడ్యూల్ 2 మొదలైంది, ఇది ఒక లెజెండరీ" అంటూ పోస్ట్ చేసింది. విడుదల చేసిన వీడియోలో సూపర్ స్టార్ రజనీకాంత్ సెట్స్‌లో ఉండగా, దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఆయనతో చర్చిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది జూన్‌లో చిత్ర యూనిట్ ఒక మేకింగ్ వీడియోను విడుదల చేసింది. అందులో సినిమా కోసం రజనీకాంత్ లుక్‌ను ఎలా ఫైనల్ చేశారో చూపించారు. దర్శకుడు అశ్వత్ మరిముత్తు సైతం "ఇదే హెయిర్ స్టైల్, ఇదే లుక్" అంటూ రజనీ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. అంతకుముందు "ది ఓజీ స్వాగ్" పేరుతో విడుదలైన మరో వీడియోలో ఫస్ట్ లుక్ కోసం రజనీకాంత్ కాస్ట్యూమ్స్, యాక్సెసరీస్ ఎంపిక చేసే విధానాన్ని, కమల్ హాసన్ కూడా సెట్స్‌కు వచ్చి రజనీతో ముచ్చటించడం వంటి సన్నివేశాలు చూపించారు.

ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక డాక్టర్‌గా నటిస్తూ, సమాజంలోని నేరస్థులను ఎదుర్కొనే పాత్రలో కనిపించనున్నారు. గతంలో సినిమా టైటిల్ ప్రకటిస్తూ కమల్ హాసన్ "ధర్మమే వెల్లుమ్!" (ధర్మమే గెలుస్తుంది) అని ట్వీట్ చేశారు. విడుదలైన టైటిల్ పోస్టర్‌లో రజనీకాంత్ ఆపరేషన్ థియేటర్‌లో స్కాల్‌పెల్ పట్టుకుని, ఒక రౌడీ షీటర్ శరీరంపై కాలు వేసి నిలబడినట్టుగా కనిపించడం సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీతలు అన్బరివ్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎస్. డిస్నీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
Rajinikanth
Dharman Movie
Kamal Haasan
Ashwath Marimuthu
Anirudh Ravichander
Raaj Kamal Films International

More Telugu News