నాకొచ్చే రూ.1 లక్ష వేతనం ట్రస్టులకు ఇస్తా: వి.హనుమంతరావు

నాకొచ్చే రూ.1 లక్ష వేతనం ట్రస్టులకు ఇస్తా: వి.హనుమంతరావు

VH to donate his salary to trusts
  • తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్ల పాటు ఉంటానన్న వీహెచ్
  • తాను అడిగితే కాంగ్రెస్ పార్టీ ఏదీ కాదనలేదన్న వీహెచ్
  • తనకు పార్టీ మారే అవసరం, అలవాటు లేదన్న వీహెచ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా తనకు నెలకు రూ.1 లక్ష వేతనం వస్తుందని, తన రెండేళ్ల పదవీ కాలంలో వచ్చే మొత్తాన్ని ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్న విద్యార్థుల కోసం ఇస్తానని వి. హనుమంతరావు ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (బీసీ సంక్షేమం, అభివృద్ధి) నియమించిన విషయం తెలిసిందే. ఆయనకు కేబినెట్ హోదా ఉంటుంది.

ఈరోజు ఆయన మాట్లాడుతూ, తన పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుందని, ప్రతి నెల రూ.1 లక్ష వేతనం వస్తుందని తెలిపారు. ఈ మొత్తాన్ని పేద విద్యార్థులకు అందించేలా ట్రస్టులకు ఇస్తానని హామీ ఇచ్చారు. తనకు కీలక పదవిని అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఏది అడిగినా కాంగ్రెస్ పార్టీ కాదనలేదని పేర్కొన్నారు. ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ అడిగితే, రాజీవ్ గాంధీ తనపై అభిమానంతో రెండుసార్లు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా రెండుసార్లు ఈ ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు.

రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా తనను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిందని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా కులగణనను గ్రామగ్రామానికి తీసుకువెళతానని అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే రేవంత్ రెడ్డి ఆశయాన్ని ముందుకు తీసుకువెళతానని అన్నారు. ప్రధాని మోదీ ఓబీసీలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. తనకు పార్టీ మారే అవసరం, అలవాటులేదని, ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలోనే ఉంటానని అన్నారు.
Advertisement
VH to donate his salary to trusts
V HanmanthaRao

More Telugu News