కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud calls for Congress victory in upcoming elections
  • బీజేపీ తెలంగాణలో సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తుందని విమర్శ
  • రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రజాపాలన సాగుతోందన్న టీపీసీసీ చీఫ్
  • వచ్చేసారి 2023 ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాలని ఆకాంక్ష
రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే ప్రతి కార్యకర్త ధ్యేయం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బీజేపీ తన కుటిల యత్నాల్లో భాగంగా తెలంగాణలో సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, అడ్డదారుల్లో ఓట్లను తొలగించే కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

బూత్ లెవల్ ఏజెంట్ నియామకం, పనితీరు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠత కోసం బూత్ లెవల్ ఏజెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రజాపాలన సాగుతోందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని సంక్షేమ పథకాలు మన వద్ద అమలవుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇది సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. వచ్చేసారి 2023 ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవడమే తమ లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.

పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. త్వరలో కార్పొరేషన్ పదవుల భర్తీ ఉంటుందని హామీ ఇచ్చారు. నాయకులు తమ సమయంలో 80 శాతాన్ని పార్టీ కోసం కేటాయించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠంగా ఉంటేనే భవిష్యత్తు విజయాలు సాధ్యమవుతాయని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
Go Back to Shorts
Mahesh Kumar Goud
Congress Party
Rahul Gandhi
Telangana Elections 2024
TPCC
Secular Votes

More Telugu News