రికార్డు సృష్టించిన సూర్యవంశీ.. మొహ్సిన్ ఖాన్ అరుదైన ఫీట్!
- ఐపీఎల్‌లో వేగంగా 500 పరుగులు సాధించిన ఆటగాడిగా వైభవ్ రికార్డు
- యువ సంచలనం సూర్యవంశీపై మొహ్సిన్ ఖాన్ ఆధిపత్యం
- ఒక్క పరుగు ఇవ్వకుండా వికెట్ తీసి మెయిడెన్ ఓవర్ నమోదు
- ఈ సీజన్‌లో రెండు మెయిడెన్ ఓవర్లు వేసిన ఏకైక బౌలర్‌గా మొహ్సిన్
మొహ్సిన్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని లాంగ్-ఆన్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. అయితే, బంతి బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేవగా, కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న దిగ్వేశ్ రాఠీ సునాయాసంగా క్యాచ్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన రెండు మెయిడెన్ ఓవర్లు కూడా మొహ్సిన్ ఖాన్ వేయడమే గమనార్హం. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీశ్ రాణాకు కూడా మొహ్సిన్ మెయిడెన్ ఓవర్ వేశాడు.
సూర్యవంశీ ఖాతాలో అరుదైన రికార్డు
అయితే, ఈ మ్యాచ్‌లో త్వరగా ఔటైనప్పటికీ సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 500 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 222 బంతుల్లోనే ఈ ఘనత సాధించి, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (260 బంతులు) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.
2022లో లక్నో జట్టులోకి వచ్చిన మొహ్సిన్, ఆ సీజన్‌లో 9 మ్యాచ్‌లలో 14 వికెట్లతో సత్తా చాటాడు. కానీ, భుజం, కాలు, వెన్ను గాయాల కారణంగా దాదాపు రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నాడు. 2024 సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీసినా, మునుపటి ఫామ్‌ను అందుకోలేకపోయాడు. తాజా ప్రదర్శనతో అతను మళ్లీ గాడిలో పడుతున్నట్లు కనిపిస్తోంది.