రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి: ప్రధానిపై షర్మిల ఫైర్

YS Sharmila Fires at Modi on Womens Reservation Bill
  • మహిళా బిల్లుపై ప్రధాని మోదీ రంగులు మారుస్తున్నారని షర్మిల విమర్శ
  • రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కుట్రేనని ఆరోపణ
  • చట్టాన్ని వెంటనే అమలు చేసి 543 స్థానాలకు వర్తింపజేయాలని డిమాండ్
  • 2029 లోపు కులగణన, శాస్త్రీయ పునర్విభజన పూర్తి చేయాలని సవాల్
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినవ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, 33 శాతం రిజర్వేషన్ల అమలుకు అసలు ద్రోహి ఆయనేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నారీశక్తి ముసుగులో డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తెచ్చిన కపట సూత్రధారి మోదీ అని, ఇప్పుడు ప్రతిపక్షాలపై పెడబొబ్బలు పెడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె విమర్శించారు.

సోషల్ మీడియాలో ఆమె స్పందిస్తూ.. "2023లో పార్లమెంట్ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే అమలు చేయకుండా, దానికి నియోజకవర్గాల పునర్విభజనతో లింకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మళ్లీ సవరణ బిల్లు తెచ్చి, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బీద ఏడుపులు ఎందుకు? రాజకీయ స్వలాభం కోసం విపక్షాలపై శాపనార్థాలు పెట్టడం దేనికి?" అని ప్రధానిని సూటిగా ప్రశ్నించారు. 

ప్రధాని మోదీకి మహిళల ఆత్మగౌరవంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 'నారీ శక్తి వందన్ అధినియమ్-2023' చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌తో ఎలాంటి సంబంధం లేకుండా ప్రస్తుతమున్న 543 పార్లమెంట్ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు పాటించాలని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా జరగాలని షర్మిల అభిప్రాయపడ్డారు. "ముందుగా 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలి. ఆ తర్వాత కులగణన జరిపి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభా తేల్చాలి. ఈ గణాంకాల ఆధారంగానే డీలిమిటేషన్‌లో రిజర్వేషన్లు కేటాయించాలి. వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలి. చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకొని ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి. బీజేపీకి దమ్ముంటే 2029 ఎన్నికలలోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి" అని ఆమె సవాల్ విసిరారు.

"శాశ్వత అధికారం కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ కుతంత్రాన్ని అడ్డుకోవడంలో విపక్షాలు విజయం సాధిస్తే, ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు మహిళలను అడ్డుపెట్టుకుని మోదీ మాట్లాడటం సిగ్గుచేటు. 2029 ఎన్నికల్లో లబ్ధి కోసం రాష్ట్రాల సమైక్యతను దెబ్బతీయాలని చూస్తే విపక్షం గుణపాఠం చెబుతుంది" అని షర్మిల హెచ్చరించారు. 

చేతనైతే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేసి చూపాలని, శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన చేపట్టాలని ప్రధాని మోదీకి, మతతత్వ బీజేపీకి, ఎన్డీఏ పక్షాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సవాల్ విసురుతున్నానని ఆమె స్పష్టం చేశారు.
Go Back to Shorts
YS Sharmila
Sharmila Reddy
AP Congress
মহিলা Reservation Bill
Narendra Modi
డీలిమిటేషన్
Women Reservation Act
Parliament
డీలిమిటేషన్ బిల్లు
నారీ శక్తి వందన్ అధినియమ్

More Telugu News