పనిచేసిన జైలుకే ఖైదీగా వెళ్లిన జైలర్.. ఖైదీలతో ఇంటి పనులు చేయించుకున్న కేసులో అరెస్ట్
Add ap7am to your home Screen

పనిచేసిన జైలుకే ఖైదీగా వెళ్లిన జైలర్.. ఖైదీలతో ఇంటి పనులు చేయించుకున్న కేసులో అరెస్ట్

Former jailer sent to same prison as inmate for making prisoners do housework
  • అజ్మీర్ సెంట్రల్ జైల్ మాజీ మహిళా జైలర్ దివ్య చౌధరి అరెస్ట్
  • ఇద్దరు ఖైదీలతో తన ఇంట్లో పనులు చేయించుకున్నారన్న ఆరోపణలు
  • రెండు నెలలుగా పరారీలో.. తాజాగా కోటాలో పట్టుకున్న పోలీసులు
  • పరారీలో మరో నిందితురాలైన జైలు గార్డు సోనియా
ఒకప్పుడు అధికారిగా హుందాగా తిరిగిన చోటే, తలవంచుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని రాజస్థాన్‌లోని అజ్మీర్ సెంట్రల్ జైల్ మాజీ మహిళా జైలర్ దివ్య చౌధరి ఊహించలేకపోయారు. ఏ జైలులో అయితే ఆమె అధికారిగా పనిచేశారో, ఇప్పుడు అదే జైలుకు ఆమె ఒక ఖైదీగా వెళ్లారు. ఇద్దరు మహిళా ఖైదీలను అక్రమంగా జైలు నుంచి బయటకు తీసుకెళ్లి, తన ఇంట్లో పనులు చేయించుకున్నారన్న ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

దివ్య చౌధరి (37) అజ్మీర్ సెంట్రల్ జైల్‌లో మహిళా విభాగం జైలర్‌గా పనిచేసేవారు. ఈ ఏడాది జులై 12న ఆమె కిరణ్, సానా అనే ఇద్దరు మహిళా ఖైదీలను జైలు నుంచి తన ప్రైవేట్ వాహనంలో బయటకు తీసుకెళ్లారు. కోర్టు అనుమతి లేకుండా, జైలు రికార్డుల్లో ఎలాంటి వివరాలు నమోదు చేయకుండా వారిని అజ్మీర్‌లోని ఏఆర్‌జీ సిటీలో ఉన్న తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఇంటి పనులు, శుభ్రపరిచే పనులు చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

జైలు ప్రధాన గేటు వద్ద ఉన్న మహిళా సిబ్బంది ఈ చర్యను అడ్డుకోగా దివ్య, మరో జైలు గార్డు సోనియా చౌధరి వారిని బెదిరించినట్లు పోలీసుల నివేదిక పేర్కొంది. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో ఆగస్టు 5న కేసు నమోదైంది. దీంతో దివ్య, సోనియా ఇద్దరినీ సస్పెండ్ చేయగా, వారు అప్పటి నుంచి పరారీలో ఉన్నారు.

రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న దివ్యను పట్టుకునేందుకు పోలీసులు సైబర్ సెల్, సీసీటీవీ ఫుటేజ్ సాయం తీసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో ఆమె కోటా నగరంలోని ఓ ఫ్లాట్‌లో దాక్కున్నట్లు గుర్తించి అక్టోబర్ 7న అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను ఒకప్పుడు తను బాధ్యతలు నిర్వహించిన అజ్మీర్ సెంట్రల్ జైలుకే ఖైదీగా తరలించారు. ఈ కేసులో మరో నిందితురాలైన సోనియా చౌధరి ఇంకా పరారీలోనే ఉందని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
Advertisement
Divya Choudhary
Ajmer Central Jail
Rajasthan Jailer Arrested
Female Jailer Prison Case
Prisoner Forced Labor Case
Rajasthan Police Investigation

More Telugu News