తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు భారీగా దరఖాస్తులు.. 4.88 లక్షల అప్లికేషన్లు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు భారీగా దరఖాస్తులు.. 4.88 లక్షల అప్లికేషన్లు

Telangana Voter List Huge Applications For New Registrations With 488 Lakh Applications
  • వివరాల సవరణ కోసం 5 లక్షలకు పైగా ఫారం-8 అప్లికేషన్లు
  • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధిక దరఖాస్తులు
  • విచారణకు హాజరుకాని ఓటర్లు.. జాబితాలో పేర్లు తగ్గే అవకాశం
  • ఓటర్ల తొలగింపు కోసం 24 వేలకు పైగా ఫారం-7 దరఖాస్తులు
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియ భారీ ఎత్తున కొనసాగుతోంది. కొత్త ఓటర్ల నమోదు, ఉన్న పేర్లలో సవరణల కోసం లక్షలాదిగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. అయితే, క్షేత్రస్థాయి విచారణకు అనేక మంది ఓటర్లు హాజరు కాకపోవడంతో తుది జాబితాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఎన్నికల సంఘం వర్గాల సమాచారం ప్రకారం.. కొత్త ఓటరుగా నమోదు కోసం ఫారం-6 కింద రాష్ట్రవ్యాప్తంగా 4,88,417 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటివరకు 51,821 దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చారు. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 1,94,204, రంగారెడ్డిలో 74,375, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 64,863 చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. హైదరాబాద్‌లో 29,226 పేర్లను, రంగారెడ్డిలో 6,206 పేర్లను కొత్తగా చేర్చారు.

మరోవైపు, ఓటరు జాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల సవరణలకు సంబంధించిన ఫారం-8 కింద ఏకంగా 5,05,159 దరఖాస్తులు రావడం గమనార్హం. వీటిలో 2,27,721 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి వివరాలను నవీకరించారు. అదేవిధంగా ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపు కోసం ఫారం-7 కింద రాష్ట్రవ్యాప్తంగా 24,323 దరఖాస్తులు అందగా, వాటిలో 12,204 దరఖాస్తులపై చర్యలు తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఆగస్టు 17న ప్రకటించిన ముసాయిదా జాబితా ఆధారంగా అధికారులు చేపట్టిన ఇంటింటి విచారణ ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ జిల్లాలో 12.54 లక్షల మందికి, రంగారెడ్డిలో 12.32 లక్షల మందికి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరిలో 14.06 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. 

అయితే, నోటీసులు అందుకున్న వారిలో చాలామంది విచారణకు హాజరు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, సరైన స్పందన లేని వారి పేర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. ఈ పరిణామాల కారణంగా, తుది ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య ముసాయిదా జాబితా కంటే గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
Advertisement
Telangana Voter List
Voter Registration Applications
Hyderabad Voter List Update
Form 6 Voter Registration
Telangana Voter List Revision
Voter ID Correction

More Telugu News