తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన నారా లోకేశ్

Nara Lokesh Inaugurates NTR Sports Complex in Tirupati
  • తిరుపతి, చంద్రగరిలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి
  • క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ అకాడమీలను ప్రారంభించిన లోకేశ్
  • క్రీడాకారులతో గ్రూప్ ఫొటో దిగిన లోకేశ్
తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామనే యువగళం హామీ కార్యరూపం దాలుస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏడాదిలో రూ.35 కోట్లకు పైగా నిధులను కేటాయించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అకాడమీలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.

శాప్, తుడా సహకారంతో రూ.10.10 కోట్ల నిధులు వెచ్చించి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించారు. ముందుగా క్రీడా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. క్రీడా ప్రాంగణం మొత్తం కలియతిరిగారు. ఈ సందర్భంగా క్రికెట్, కబడ్డీ, కోకో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ క్రీడాకారులతో గ్రూప్ ఫోటో దిగారు. కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

అనంతరం ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంతో పాటు ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ ను ప్రారంభించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాల్ రాజ్, ఇతర క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో సంభాషించి వారిని ఉత్సాహపరిచారు. క్రీడా ప్రాంగణంలో ప్రణీత్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను క్రికెట్ మైదానం, ఖోఖో, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ కోర్టులతో పాటు పలు క్రీడా సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ఈ సముదాయం క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాంత భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించనుంది.

అంతకుముందు తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రూ.5.35 కోట్ల వ్యయంతో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, 200 మంది క్రీడాకారులకు వసతి సదుపాయం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన జూనియర్ బాక్సింగ్ రింక్ ను ప్రారంభించారు. గూడూరు నియోజకవర్గం కోటలో రూ.2.31 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం, సూళ్లూరుపేటలో రూ.2.70 కోట్ల వ్యయంతో క్రీడా వికాస కేంద్రం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రేణిగుంట ఏపీఎస్టీఆర్ఈఐఎస్ స్కూల్ లో రూ.80 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.
 
ఈ కార్యక్రమంలో ఏపీ రవాణ, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సి.షణ్ముగ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ శ్రీపతి బాబు, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సూర్య చరిష్మ తమిరి, దండు పూజ, నవ్య కందేరి, భారత అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, అంధ మహిళా క్రికెటర్ పంగి కరుణ కుమారి, పారా అథ్లెట్ రవి రంగలి, పారా సైక్లిస్ట్ షేక్ అర్షద్, పారా అథ్లెట్ కె.లలిత, ఆర్చరీ ప్లేయర్ టి.గణేష్ మణిరత్నం, భారత హాకీ క్రీడాకారిణి రజని ఇటిమరపు తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
NTR Sports Complex
Tirupati
Andhra Pradesh Sports
Mithali Raj
Karanam Malleswari

More Telugu News