ఐపీఎల్-2026: టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యాలకు జరిమానా

Tim David Fined in IPL 2026 for Umpire Disagreement
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆర్‌సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాలకు మ్యాచ్ రిఫరీ జరిమానాలు విధించారు.

ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సమయంలో అంపైర్ సూచనలను పదేపదే ధిక్కరించినందుకు టిమ్ డేవిడ్‌పై లెవల్ 1 నేరం కింద చర్యలు తీసుకున్నారు. ఇన్నింగ్స్‌లోని 18వ, చివరి ఓవర్లలో అంపైర్లు బంతిని మార్చాలని ప్రయత్నించగా, డేవిడ్ దానిని పరిశీలించాలని పట్టుబట్టి తిరిగి ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ తప్పిదానికి గాను అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా జతచేశారు. డేవిడ్ తన తప్పును అంగీకరించి, శిక్షను ఆమోదించాడు.

మరోవైపు, మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ముంబై జట్టుకు ఇది మొదటి తప్పిదం కావడంతో నిబంధనల ప్రకారం ఈ శిక్షను ఖరారు చేశారు.

ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో ముంబైపై గెలిచింది. తొలుత ఫిల్ సాల్ట్ (78), రజత్ పటిదార్ (53), విరాట్ కోహ్లీ (50) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో ఆర్‌సీబీ 4 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (19) గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం ముంబైకి దెబ్బతీసింది. చివర్లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (71*) మెరుపులు మెరిపించినా, ముంబై 222 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరగా, ముంబై వరుసగా మూడో ఓటమిని నమోదు చేసింది.
Go Back to Shorts
Tim David
IPL 2026
Hardik Pandya
Mumbai Indians
Royal Challengers Bangalore
Slow Over Rate
Match Fine
Cricket
Wankhede Stadium
Phil Salt

More Telugu News