కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

Telangana HC grants one week anticipatory bail to Pawan Khera
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మపై పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారన్న కేసులో ఆయనకు వారం రోజుల పాటు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అస్సాంలోని సంబంధిత కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించింది.

గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ కె. సుజన, తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం వెలువరించారు. అస్సాం వెళ్లేందుకు వీలుగా తనకు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాలని పవన్ ఖేరా హైకోర్టును ఆశ్రయించారు. ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని, రాజకీయ ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చేందుకే అస్సాం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. ఖేరా ఆరోపణలు తప్పని తేలినా, ఇది పరువు నష్టం కేసు కిందకే వస్తుందని, అరెస్టు చేయాల్సిన అవసరం లేదని వాదించారు. తాను హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఎఫ్‌ఐఆర్ గురించి తెలియడంతోనే కోర్టును ఆశ్రయించారని, విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

అస్సాం పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దేవాజిత్ సైకియా వాదిస్తూ, హైదరాబాద్‌లో ఈ పిటిషన్ విచారణార్హం కాదని అభ్యంతరం తెలిపారు. ఢిల్లీ నివాసి అయిన ఖేరా, అస్సాంలో ఎందుకు పిటిషన్ వేయలేదో సరైన కారణం చూపలేదని పేర్కొన్నారు.

కేసు నేపథ్యం
అస్సాం సీఎం భార్య రినికి భూయాన్ శర్మకు బహుళ విదేశీ పాస్‌పోర్టులు, దుబాయ్‌లో అప్రకటిత ఆస్తులు, అమెరికాలో షెల్ కంపెనీలు ఉన్నాయని పవన్ ఖేరా ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అస్సాం పోలీసులు ఆయనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) కింద ఫోర్జరీ, పరువు నష్టం, నేరపూరిత కుట్ర వంటి 14 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లగా, ఆయన అక్కడ లేరు. హైదరాబాద్‌లోని ఆయన భార్య ఇంటి వద్ద కూడా భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తనపై పెట్టిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా సీఎం పోలీసులను అడ్డం పెట్టుకుంటున్నారని, తాను ఇలాంటి బెదిరింపులకు భయపడబోనని ఖేరా ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.
Go Back to Shorts
Pawan Khera
Pawan Khera bail
Telangana High Court
Himanta Biswa Sarma
Riniki Bhuyan Sarma
Assam CM wife
Defamation case
Assam police FIR
Abhishek Manu Singhvi
Transit anticipatory bail

More Telugu News