ఐపీఎల్ 2026 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఓటమితో ప్రారంభించింది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి అనంతరం హెడ్ కోచ్ డేనియల్ వెటోరి డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో మాట్లాడి వారిలో స్ఫూర్తి నింపాడు. ఈ ప్రదర్శన ఆందోళన చెందాల్సినంత తీవ్రమైనది కాదని భరోసా ఇచ్చాడు. 

బ్యాటింగ్ విభాగం ప్రదర్శనపై వెటోరి సంతృప్తి వ్యక్తం చేశాడు. పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ, జట్టు 201 పరుగుల భారీ స్కోరు సాధించడాన్ని ప్రశంసించాడు. "ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ బ్యాటింగ్ యూనిట్ అద్భుతంగా పుంజుకుంది. ఇషాన్ కిషన్, క్లాసెన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన తీరు, ఆ తర్వాత వచ్చిన వారు జట్టుకు మంచి స్కోరు అందించడం గొప్ప విషయం" అని పేర్కొన్నాడు.

అయితే, బౌలింగ్‌లో మాత్రం ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామని వెటోరి అంగీకరించాడు. "బౌలింగ్‌లో మనం ఎక్కడ తప్పు చేశామో అర్థం చేసుకోవాలి. సరైన లెంగ్త్‌లో బంతులు వేయడంలో చాలా వెనుకబడ్డాం. ఏకంగా 10 ఫుల్ బంతులు సిక్సర్లుగా వెళ్లాయి. అలాంటప్పుడు మ్యాచ్ గెలవడం చాలా కష్టం" అని స్పష్టం చేశాడు. ఫీల్డింగ్‌లోనూ కొన్ని లోపాలు కనిపించాయని, అయితే ఇది కేవలం బౌలర్ల వైఫల్యం కాదని, జట్టుగా బాధ్యత తీసుకోవాలని అన్నాడు.

తదుపరి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న నేపథ్యంలో, కోల్‌కతాలో లభించే రెండు రోజుల ప్రాక్టీసులో లోపాలను సరిదిద్దుకోవాలని ఆటగాళ్లకు సూచించాడు. "ఇవి చాలా చిన్న మార్జిన్లు. రెండు మంచి బంతులు వేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. తదుపరి మ్యాచ్‌కు పక్కా ప్రణాళికతో సిద్ధమవుదాం" అని వెటోరి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఇషాన్ కిషన్ (80) అద్భుత ప్రదర్శనతో 201 పరుగులు చేయగా, ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.