Jeevan Reddy: జరిగిన అవమానం చాలు అన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి నిరాకరించిన వైనం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్దండుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడం, ఆ తర్వాత జిల్లాలో తనకు ప్రాధాన్యత తగ్గడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడంతో, కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా పార్టీ కండువా కప్పే ప్రయత్నం చేయగా... "జరిగిన అవమానం చాలు.. ఇక ఈ కండువా వద్దు" అంటూ జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించడం అంరినీ షాక్ కు గురిచేసింది.
మరోవైపు, జీవన్ రెడ్డికి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా ఉండి, ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి తిరుగుతున్న డీసీసీ అధ్యక్షుడు నందయ్యను లోపలికి రానివ్వకుండా జీవన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.
దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన తనకు కనీస సమాచారం లేకుండా, తన రాజకీయ ప్రత్యర్థిని పార్టీలోకి ఎలా తెస్తారని జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. గతంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వంటి వారు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జీవన్ రెడ్డి మెత్తబడలేదు. ఇప్పుడు పీసీసీ చీఫ్ స్వయంగా వచ్చినా... జీవన్ రెడ్డి ఏమాత్రం శాంతించలేదు.