Chandrababu: తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలవాలి: ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Aims Telugu People to be Number One Globally
షార్ట్స్‌లో చూడండి
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'పరాభవ' నామ సంవత్సర ఉగాది వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి, ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణను, అభివృద్ధి సంకల్పాన్ని ప్రజల ముందుంచారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక అని, ఈ ఏడాది అంతా ప్రజలకు మంచే జరగాలని ఆకాంక్షించారు.

20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
ఈ సందర్భంగా యువతకు ఉద్యోగాల కల్పనపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇప్పటికే 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇందులో మెగా డీఎస్సీ ద్వారా 15,940 టీచర్ పోస్టులు, ఏపీపీఎస్సీ ద్వారా 10,060, పోలీసు కానిస్టేబుళ్లుగా 5,757 మందిని నియమించామని వెల్లడించారు. ప్రైవేటు రంగంలోనూ 6.28 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

పుష్కరాల లోపే పోలవరం పూర్తి
రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును రాబోయే గోదావరి పుష్కరాల లోపే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గత పాలకులు నిర్వాసితులకు పైసా కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.1,943 కోట్లు పరిహారంగా అందించిందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తికి నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దేవతల రాజధాని అమరావతిని ఇప్పుడు ప్రజారాజధానిగా తీర్చిదిద్దుతున్నామని, విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రంగా ఆర్థిక కారిడార్లు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

గత ఐదేళ్లు విధ్వంసం.. ఇప్పుడు సంక్షేమం 
గత ఐదేళ్ల పాలనలో ప్రజలు పండుగలు కూడా సంతోషంగా జరుపుకోలేని భయానక వాతావరణం ఉండేదని, ఒక వ్యక్తి కారణంగా రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని విమర్శించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రూ.20 వేలు, స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దివ్యాంగులకు చేయూత వంటి పథకాలతో ప్రతీ వ్యక్తికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పిస్తున్నామని వివరించారు.

2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను విదేశాల్లోని ప్రవాసాంధ్రులు అద్భుతంగా పాటిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలను సీఎం చంద్రబాబు ప్రదానం చేశారు. 

Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
Ugadi Celebrations
Polavaram Project
Job Creation
Amaravati
TDP
Janasena
BJP

More Telugu News