Sachin Tendulkar: టీమిండియా రికార్డు విజయంపై సచిన్, కోహ్లీ ఏమన్నారంటే...!

Sachin Kohli React to Team Indias Record Win
  • టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా
  • న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం
  • భారత ఆటగాళ్లపై సచిన్, కోహ్లీ ప్రశంసల జల్లు
  • వరుసగా రెండుసార్లు కప్పు గెలిచిన తొలి జట్టుగా రికార్డు
అహమ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో టీమిండియా సృష్టించిన సరికొత్త చరిత్రపై క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి, న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన తీరును వారు కొనియాడారు.

ఈ విజయంపై విరాట్ కోహ్లీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "ఛాంపియన్స్! అహమ్మదాబాద్‌లో టీమిండియాకు ఇది అద్భుత విజయం. టోర్నమెంట్ ఆసాంతం మనవాళ్ళు ఎక్స్‌ప్లోజివ్ క్రికెట్ ఆడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాడి మళ్లీ వరల్డ్ చాంపియన్లుగా నిలిచిన తీరు అద్భుతం" అని పేర్కొన్నాడు.

మరోవైపు సచిన్ టెండూల్కర్ భారత బౌలింగ్ వ్యూహాన్ని ప్రత్యేకంగా విశ్లేషించాడు. "టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు కప్పు గెలిచిన ఘనత భారత్‌కే దక్కుతుంది. కివీస్ బౌలర్లతో పోలిస్తే మన బౌలర్లు స్లోయర్, షార్ట్ పిచ్ బంతులను తెలివిగా విసిరారు. ఇక్కడి బౌండరీ కొలతలకు తగ్గట్టుగా లెంగ్త్స్ మార్చడం వల్లే విజయం సాధ్యమైంది" అని సచిన్ వివరించాడు.

మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. సంజు శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. అనంతరం జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) ధాటికి న్యూజిలాండ్ 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో సొంతగడ్డపై టీ20 కప్పు గెలిచిన తొలి జట్టుగా, మూడుసార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
Sachin Tendulkar
Virat Kohli
T20 World Cup 2026
India vs New Zealand
Cricket
Jasprit Bumrah
Sanju Samson
Abhishek Sharma
Ishan Kishan
Ahmedabad

More Telugu News