Nara Lokesh: మా పిల్లలు బంగారం.. బాలికలను మెచ్చుకున్న మంత్రి లోకేశ్

Nara Lokesh Appreciates School Girls Honesty in Venkatagiri
  • బంగారం, నగదుతో దొరికిన పర్సును పోలీసులకు అప్పగించిన విద్యార్థినులు
  • వెంకటగిరి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఐదుగురు బాలికల నిజాయతీ
  • విద్యార్థినుల నీతిని మెచ్చుకుంటూ పోస్ట్ చేసిన మంత్రి నారా లోకేశ్
  • వారి ప్రవర్తన విద్యాశాఖ గౌరవాన్ని పెంచిందని కొనియాడిన మంత్రి
తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు తమ నిజాయతీని చాటుకున్నారు. దారిలో దొరికిన బంగారం, నగదు ఉన్న పర్సును పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు. ఈ విద్యార్థినులను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు.

వివరాల్లోకి వెళితే... వెంకటగిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న బి. గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతిక (8వ తరగతి), పద్మశ్రీ (6వ తరగతి), హేమలత (7వ తరగతి) గురువారం సాయంత్రం పాఠశాల ముగిశాక ఇంటికి బయలుదేరారు. ఎస్‌బీఐ బ్యాంకు వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా వారికి ఒక పర్సు కనిపించింది.

దాన్ని తెరిచి చూడగా అందులో బంగారం, నగదు ఉండటంతో ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై స్వరూపకు అప్పగించారు. అనంతరం బస్టాప్‌కు తిరిగి రాగా, పర్సు పోగొట్టుకున్న మహిళ అక్కడ వెతుకుతూ కనిపించింది. విషయం చెప్పి ఆమెను కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు వివరాలు నిర్ధారించుకుని ఆ పర్సును సదరు మహిళకు అందజేశారు.

ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "నిజాయతీలో మా పిల్లలు బంగారం" అని కొనియాడారు. "చిన్న వయసులోనే మీ నీతివంతమైన ప్రవర్తన ఆదర్శంగా నిలిచింది. మీ నిజాయతీ మన విద్యాశాఖ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. మీకు ఎల్లప్పుడూ అండగా ఉండే అన్నగా నేను గర్విస్తున్నాను" అంటూ మంత్రి లోకేశ్ విద్యార్థినులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Nara Lokesh
Venkatagiri
Government School Students
Honesty
Gold
Purse
Police
Andhra Pradesh
Telugu News
Education

More Telugu News