Nara Lokesh: ఇవి అడ్రస్ లేని కంపెనీలా?: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Slams Opposition on IT Company Allegations
  • రాబోయే ఐదేళ్లలో కేవలం ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమన్న లోకేశ్
  • గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల ఏర్పాటుపై రాద్ధాంతం తగదని హితవు
  • పెట్టుబడుల ఆకర్షణ కోసం గుజరాత్ తరహాలో రూపాయికే భూమి పాలసీ
  • రూ.1.50 లక్షల కోట్ల విలువైన 52 ఒప్పందాలతో 2.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
"గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఆసిప్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు అడ్రస్ లేని కంపెనీలా? యువతకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు భూములిస్తే తప్పేంటి?" అని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యర్థి పక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో ఐటీ శాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. 99 పైసలకే (రూపాయికి) భూమి కేటాయింపులపై టీమ్-11 తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. కేవలం రాజకీయ విద్వేషంతోనే మంచి కంపెనీలపై బురదజల్లుతున్నారని, కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

విశాఖపట్నాన్ని గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఒక్క ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశాన్ని ఒక సవాలుగా తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.1.50 లక్షల కోట్ల విలువైన 52 ఎంవోయూలు కుదుర్చుకున్నామని, తద్వారా 2.3 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ టాటా నానో ఫ్యాక్టరీ కోసం రూపాయికే భూమి ఇచ్చి, తద్వారా భారీ ఆటోమొబైల్ ఎకో సిస్టమ్‌ను ఎలా సృష్టించారో.. అదే స్ఫూర్తితో ఏపీలోనూ 'లిఫ్ట్' పాలసీని తీసుకొచ్చామన్నారు. టాప్-500 కంపెనీలు వచ్చి భారీగా ఉద్యోగాలు ఇస్తే ఉచితంగానైనా భూమి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.

గత ప్రభుత్వం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలపై ఒక యుద్ధమే చేసిందని మంత్రి ధ్వజమెత్తారు. 2014-19 మధ్య చంద్రబాబు కృషితో విశాఖకు వచ్చిన ఒక ఫార్చ్యూన్-500 కంపెనీపై ఆనాడు వైసిపి నేతలు పార్లమెంటులో చేసిన నిరాధార ఆరోపణల వల్ల.. సదరు కంపెనీ సీఈవో తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో ఒక్క ఐటీ కంపెనీకి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా టెర్రరిజాన్ని తలపించేలా పాలన సాగించారని ఆరోపించారు.

చంద్రబాబు అనుభవమే బ్రాండ్‌గా పెట్టుబడులు తెస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే కాగ్నిజెంట్ సీఈవోతో మాట్లాడి ఒప్పించామని, ఫలితంగా విశాఖలో 25 వేల ఉద్యోగాల కల్పనకు ఆ సంస్థ ముందుకొచ్చిందన్నారు. అలాగే గూగుల్ మెగా డేటా సెంటర్, టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్, ఆసిప్ సెమీకండక్టర్ యూనిట్ వంటివి విశాఖ కేంద్రంగా రాబోతున్నాయన్నారు. "రాజకీయాలు రాష్ట్రం లోపల చేద్దాం.. బయటకు వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేద్దాం" అని ప్రత్యర్థి పక్షానికి మంత్రి హితవు పలికారు. మీకు తెలిసిన కంపెనీలు ఉంటే చెప్పండి, పర్సనల్‌గా ఫాలో అప్ చేసి వాటిని రాష్ట్రానికి తెచ్చే బాధ్యత నాది అని లోకేశ్ ఆఫర్ ఇచ్చారు.
Nara Lokesh
Andhra Pradesh
IT sector
Visakhapatnam
Cognizant
TCS
Google
AP Assembly
IT investments
employment

More Telugu News