Tariq Mahmood Jahangiri: పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో పెను సంచలనం: నకిలీ డిగ్రీతో పాకిస్థాన్ హైకోర్టు జడ్జిగా ఐదేళ్ల కొలువు!

Pakistan High Court Judge Tariq Mahmood Jahangiri Fired Over Fake Degree
  • ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జిగా ఐదేళ్ల పనిచేసిన మహమూద్ జహంగీరి
  • జహంగీరిని బాధ్యతల నుంచి తొలగించిన ఇస్లామాబాద్ హైకోర్టు
  • ఐదేళ్ల పాటు జడ్జిగా అనేక తీర్పులు వెలువరించిన జహంగీరి

పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో అత్యంత విస్మయకరమైన ఘటన వెలుగుచూసింది. ఏకంగా హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి.. నకిలీ లా డిగ్రీతో ఆ పదవిని దక్కించుకున్నట్లు తేలడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ తారిక్ మహమూద్ జహంగీరిని పదవి నుంచి తొలగిస్తూ కోర్టు సోమవారం 116 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది.


జహంగీరి విద్యార్హతలపై అనుమానాలు రావడంతో విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. కరాచీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నుంచి అసలు రికార్డులను తెప్పించింది. ఆ రికార్డుల ప్రకారం.. జహంగీరి 1988లో ఒక నకిలీ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌తో పరీక్షలకు హాజరయ్యారని, అప్పట్లో కాపీ కొడుతూ దొరికిపోవడంతో యూనివర్సిటీ ఆయనపై మూడేళ్ల పాటు నిషేధం విధించిందని వెల్లడైంది. అయితే, ఆ శిక్షను అనుభవించకుండానే, ఆయన తప్పుడు మార్గాల్లో 'ఇంతియాజ్ అహ్మద్' అనే మరో విద్యార్థికి కేటాయించిన నంబర్‌ను వాడుకుని పట్టా పొందినట్లు కోర్టు నిర్ధారించింది.


ఈ వ్యవహారంలో ఇస్లామాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. జహంగీరి లా డిగ్రీ 'అబ్ ఇనిషియో' (తొలి నుంచీ చెల్లనిది) అని కోర్టు స్పష్టం చేసింది. డిగ్రీయే లేనప్పుడు హైకోర్టు జడ్జిగా ఆయన నియామకం చట్టబద్ధంగా అసాధారణమని పేర్కొంది. తన విద్యార్హతలకు సంబంధించిన అసలు పత్రాలను సమర్పించేందుకు కోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ, జహంగీరి వాటిని చూపించడంలో విఫలమయ్యారు. దీనికి బదులుగా విచారణను వాయిదా వేయాలని, బెంచ్ మార్చాలని రకరకాల సాకులు చెప్పడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నమెంట్ ఇస్లామియా లా కాలేజీ ప్రిన్సిపాల్ కూడా కోర్టులో కీలక సాక్ష్యం చెబుతూ.. తమ సంస్థలో జహంగీరి ఎప్పుడూ అడ్మిషన్ తీసుకోలేదని ధృవీకరించారు.


డిసెంబర్ 2020లో హైకోర్టు జడ్జిగా నియమితులైన జహంగీరి, సుమారు ఐదేళ్ల పాటు అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఆయన విధులపై స్టే విధించిన కోర్టు, తాజాగా తుది తీర్పుతో ఆయనను పదవి నుంచి శాశ్వతంగా తొలగించింది.

Tariq Mahmood Jahangiri
Pakistan
Islamabad High Court
Fake law degree
Justice system
Karachi University
Court judgment
Judicial scandal
Imtiaz Ahmed
High Court Judge

More Telugu News