Jagan Mohan Reddy: ఇది బాబు భజన.. అన్నీ తప్పుడు లెక్కలే: ఏపీ బడ్జెట్‌పై జగన్ విమర్శలు

Jagan Mohan Reddy Criticizes AP Budget as Babu Bhajan False Accounts
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది ప్రజల బడ్జెట్ కాదని, కేవలం చంద్రబాబు భజన, తప్పుడు లెక్కలతో నిండిన మోసపూరిత పత్రమని ఆయన అభివర్ణించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

"మోసానికి షర్టు, ప్యాంటు వేస్తే అది చంద్రబాబే. అబద్ధానికి రెక్కలు కడితే అది కూడా చంద్రబాబే" అంటూ జగన్ ఘాటు వ్యాఖ్యలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. చంద్రబాబు పాలన "పబ్లిసిటీ పీక్.. పర్ఫామెన్స్ వీక్" అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఊదరగొట్టిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను మూడు బడ్జెట్‌లలోనూ గాలికి వదిలేసి అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు.

ఆర్థిక లెక్కలన్నీ తప్పుల తడకలేనని జగన్ అంకెలతో సహా వివరించారు. 2024-25లో రూ.1.19 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి, వాస్తవానికి రూ.94,937 కోట్లు మాత్రమే రాబట్టారని తెలిపారు. పది నెలల్లో రాష్ట్ర ఆదాయ వృద్ధి కేవలం 4.25 శాతమేనని పేర్కొన్నారు. కాగ్ రిపోర్ట్ ప్రకారం, దేశంలోని 23 రాష్ట్రాల్లో సొంత ఆదాయాల పురోగతిలో ఏపీ చివరి నుంచి రెండో స్థానంలో (22వ ర్యాంక్) ఉందని, ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో 2026-27 నాటికి ఆదాయం 45% పెరుగుతుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్ర ఆదాయం 'బాబు అండ్ కో' జేబుల్లోకి వెళ్తోందని, "దోచుకో.. దాచుకో.. పంచుకో" అనే విధానం అమలవుతోందని జగన్ ఆరోపించారు. అప్పుల వివరాలను బడ్జెట్‌లో చూపించకపోవడం పారదర్శకత లేకపోవడానికి నిదర్శనమన్నారు. మహిళలకు రూ.1,500, నిరుద్యోగ భృతి వంటి హామీలకు నిధుల కేటాయింపు ఏదని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల డబ్బుతో కొలంబో, ఢిల్లీ అంటూ విమానాల్లో తిరుగుతూ క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ, స్టేడియాల్లో జల్సాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. "రాత్రికి కొలంబోలో ఉంటాడు, మరుసటి రోజు ఉదయం విజయవాడలో ఉంటాడు... సాయంత్రానికి ఢిల్లీ వెళతాడు... అంతా ప్రైవేటు విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలా జల్సాలు చేయడం ఎక్కడైనా ఉందా? చంద్రబాబుకు ఒక విమానం, లోకేశ్ కు ఒక విమానం, పవన్ కల్యాణ్ కు ఓ విమానం... అందరూ గాల్లోనే ఉంటారు. క్రికెట్ మ్యాచ్ చూడాలంటే కొలంబోనే వెళ్లాలా... టీవీలో చూస్తే కనపడదా... నేను కూడా టీవీలోనే చూశాను" అంటూ జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 
Go Back to Shorts
Jagan Mohan Reddy
AP Budget 2024
Andhra Pradesh Budget
Chandrababu Naidu
YS Jagan
Nara Lokesh
AP Finance
Andhra Pradesh Economy
TDP Government
AP Debts

More Telugu News