Om Birla: బంగ్లా నూతన ప్రధాని ప్రమాణ స్వీకారానికి భారత్ ప్రతినిధిగా స్పీకర్ ఓం బిర్లా

Om Birla to Represent India at Bangladesh PM Swearing In
షార్ట్స్‌లో చూడండి
బంగ్లాదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17న రాజధాని ఢాకాలో జరగనున్నట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ కీలక కార్యక్రమంలో స్పీకర్ పాల్గొనడం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన, చిరకాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ తెలిపింది. "చరిత్ర, సంస్కృతి, పరస్పర గౌరవంతో ముడిపడి ఉన్న పొరుగు దేశంగా, తారిఖ్ రెహమాన్ నాయకత్వంలో ఏర్పడుతున్న ఎన్నికైన ప్రభుత్వాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న బంగ్లాదేశ్‌కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది" అని ప్రకటనలో పేర్కొంది.

ఫిబ్రవరి 12న 300 స్థానాలకు గాను 299 స్థానాలకు పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం, బీఎన్‌పీ 209 సీట్లు గెలుచుకుంది. మరోవైపు, జమాత్-ఎ-ఇస్లామీ 68 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రముఖ బంగ్లాదేశ్ పత్రిక 'ప్రొథోమ్ ఆలో' కథనం ప్రకారం, ఫలితాలు నిలిపివేసిన రెండు నియోజకవర్గాల్లోనూ బీఎన్‌పీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు.

ఫిబ్రవరి 17న జాతీయ సంసద్ భవన్‌లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎ.ఎం.ఎం. నసీరుద్దీన్ ప్రమాణం చేయించనున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు ఒక పురుషుడు ప్రధానమంత్రి కానున్నారు. అయితే, గత 18 నెలల తాత్కాలిక ప్రభుత్వ హయాంలో పెరిగిన అశాంతి, తీవ్రవాదాన్ని అధిగమించడం కొత్త ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్‌గా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Om Birla
Bangladesh Election
Bangladesh Prime Minister
Lok Sabha Speaker
India Bangladesh Relations
Bangladesh Nationalist Party
Tarikh Rahman
Dhaka
Bangladesh Parliament
Indian Foreign Ministry

More Telugu News