దుబాయ్‌లో 'రాజు ఆమ్లెట్' సృష్టికర్త రాజీవ్ మెహెరిష్ కన్నుమూత

Rajeev Meherish founder of Raju Omlet passes away in Dubai
  • గుడ్డుతో గ్లోబల్ బ్రాండ్‌ను సృష్టించిన భారతీయ వ్యాపారవేత్త ఇకలేరు
  • దుబాయ్‌లో ప్రఖ్యాత ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ మృతి
  • భారత్‌లోని రోడ్డు పక్కన హోటల్ స్ఫూర్తితో గ్లోబల్ బ్రాండ్ నిర్మాణం
  • కుమారుడితో కలిసి 18 సీట్ల చిన్న రెస్టారెంట్‌గా వ్యాపార ప్రస్థానం ప్రారంభం
  • ‘రాజు ఆమ్లెట్’ విజయంపై హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో కేస్ స్టడీ
దుబాయ్‌లో ప్రఖ్యాత రెస్టారెంట్ చైన్ 'రాజు ఆమ్లెట్' వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త రాజీవ్ మెహెరిష్ జులై 19న కన్నుమూశారు. కేవలం గుడ్డుతో వినూత్న వంటకాలను అందిస్తూ దుబాయ్‌లో ఒక విజయవంతమైన బ్రాండ్‌ను నిర్మించిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.

ముంబై యూనివర్సిటీలో కామర్స్‌లో పీజీ పూర్తి చేసిన రాజీవ్, 1980లో మెరుగైన అవకాశాల కోసం దుబాయ్ వెళ్లారు. తొలినాళ్లలో సేల్స్ రంగంలో పనిచేసి, ఆ తర్వాత 'ఖలీజ్ టైమ్స్' వంటి పత్రికలకు అడ్వర్టైజింగ్ స్పేస్ అమ్ముతూ కెరీర్ కొనసాగించారు. గుజరాత్‌లోని వడోదరలో ఉన్న 'రాజు ఆమ్లెట్' అనే చిన్న రోడ్డు పక్కన కొట్టును చూసి స్ఫూర్తి పొందిన ఆయన, ఆ ఆలోచనను దుబాయ్‌లో అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు నకుల్ మెహెరిష్‌తో కలిసి దుబాయ్‌లోని కరామా ప్రాంతంలో 18 సీట్ల సామర్థ్యంతో చిన్న రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

మొదట్లో కొన్ని రకాల ఆమ్లెట్లతో మొదలైన ఈ రెస్టారెంట్, క్రమంగా ఆమ్లెట్లు, భుర్జీ, ఎగ్స్ కేజ్రీవాల్ వంటి పదుల సంఖ్యలో వినూత్న వంటకాలతో విస్తరించింది. సరసమైన ధరలు, ఆకట్టుకునే భారతీయ స్ట్రీట్-స్టైల్ ఇంటీరియర్‌తో రాజు ఆమ్లెట్ స్థానికులు, పర్యాటకులతో పాటు దుబాయ్ రాజకుటుంబ సభ్యులను సైతం ఆకర్షించింది. 

కేవలం ఒకే ఒక పదార్థంతో (గుడ్డు) విజయవంతమైన వ్యాపారాన్ని ఎలా నిర్మించవచ్చో వివరిస్తూ 'రాజు ఆమ్లెట్' ప్రస్థానం హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో కేస్ స్టడీగా చోటు సంపాదించడం విశేషం. ఒక చిన్న ఆలోచనను సృజనాత్మకత, నిలకడతో ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా మార్చిన రాజీవ్ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Advertisement
Rajeev Meherish
Raju Omlet Dubai
Indian entrepreneur Dubai
Dubai restaurant founder death
Harvard Business Review case study
Nakul Meherish

More Telugu News