ఓటమిని జీర్ణించుకోలేకపోయారా?.. అర్జెంటీనా ప్రవర్తన సిగ్గుచేటంటున్న‌ ఫుట్‌బాల్ ప్రపంచం!

Argentina behavior slammed by football world after FIFA World Cup 2026 final loss
  • ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ విజయం
  • ట్రోఫీ వేడుకలో స్పెయిన్‌ను అవమానించిన అర్జెంటీనా ఆటగాళ్లు
  • ట్రోఫీ వేడుకకు వీపు చూపిన మెస్సీ సేన.. ఇది సిగ్గుచేటన్న విశ్లేషకులు
  • గోల్డెన్ బాల్ అవార్డు సమయంలో మెస్సీ పేరుతో అభిమానుల నినాదాలు
  • మ్యాచ్‌లో, ఆ తర్వాత ఇద్దరు అర్జెంటీనా ఆటగాళ్లకు రెడ్ కార్డులు
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైన తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. నిన్న‌ న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాను ఓడించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన పరిణామాలు ఫుట్‌బాల్ ప్రపంచంలో పెద్ద దుమారం రేపాయి. అర్జెంటీనా ఆటగాళ్లు, అభిమానుల ప్రవర్తన సంస్కారహీనంగా ఉందని, క్రీడాస్ఫూర్తికి మాయని మచ్చ తెచ్చిందని పలువురు విశ్లేషకులు మండిపడుతున్నారు.

మ్యాచ్ ముగిసిన తర్వాత రన్నరప్ పతకాలు అందుకున్న అర్జెంటీనా ఆటగాళ్లు, కొత్త ఛాంపియన్లను అభినందించకుండా మైదానం నుంచి వెళ్లిపోయారు. స్పెయిన్ జట్టు ట్రోఫీని స్వీకరించేందుకు సిద్ధమవుతుండగా, లియోనెల్ మెస్సీ సహా అర్జెంటీనా ఆటగాళ్లందరూ మైదానంలో మరోవైపుకు వెళ్లి వీపు చూపిస్తూ నిలబడ్డారు. అంతకుముందు అర్జెంటీనా పతకాలు అందుకుంటున్నప్పుడు స్పెయిన్ ఆటగాళ్లు చప్పట్లతో అభినందనలు తెలిపినా, అర్జెంటీనా మాత్రం ఆ గౌరవాన్ని తిరిగి ఇవ్వలేదు. ఇది ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఇక, టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ రోడ్రి 'గోల్డెన్ బాల్' అవార్డు అందుకుంటున్నప్పుడు స్టేడియంలోని అర్జెంటీనా అభిమానులు 'మెస్సీ, మెస్సీ' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ పరిణామం అక్కడి వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చింది. 

ఈ ఘటనలపై Goal.com కథనం ప్రకారం.. టాక్‌స్పోర్ట్ బ్రాడ్‌కాస్టర్ అడ్రియన్ డర్హమ్ తీవ్రంగా స్పందించారు. "వారిలో కనీస సంస్కారం లేదు. ఈ రోజు వారు సిగ్గుపడే రీతిలో ప్రవర్తించారు. ఫైనల్లో ఓటమిని వారు అంగీకరించలేకపోతున్నారు. అర్జెంటీనా జట్టు ఈ ఆటకు, ప్రపంచకప్‌కు పూర్తి అవమానం" అని ఆయన ఘాటుగా విమర్శించారు.

"ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత సులువైన గ్రూప్‌లో డ్రా పొంది, నాకౌట్ దశలో కష్టపడి గెలిచి, ఇక్కడికొచ్చి తమను తాము అవమానించుకున్నారు" అని డర్హమ్ వ్యాఖ్యానించారు. టోర్నీ ఆద్యంతం అర్జెంటీనాకు అనుకూలంగా అనేక నిర్ణయాలు వచ్చాయని ఆయన ఆరోపించారు.

నిజానికి ఫైనల్ ముగిసిన వెంటనే అర్జెంటీనా ఆటగాళ్లలో అసహనం కట్టలు తెంచుకుంది. దాంతో స్పెయిన్ ఆటగాళ్లపై దురుసుగా ప్రవర్తించారు. స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగినందుకు లియాండ్రో పరేడెస్‌కు రెడ్ కార్డ్ చూపించారు. అంతకుముందు ఆట అదనపు సమయంలో ఎంజో ఫెర్నాండెజ్ కూడా రెండో ఎల్లో కార్డ్‌తో మైదానం వీడాడు. దీంతో ప్రపంచకప్ ఫైనల్లో రెడ్ కార్డ్ పొందిన ఆరో ఆటగాడిగా నిలిచాడు.

ఈ విజయంతో స్పెయిన్ రెండోసారి ప్రపంచకప్ గెలవడమే కాకుండా వరుసగా 38 మ్యాచ్‌లలో అపజయం ఎరుగని యూరోపియన్ జట్టుగా రికార్డు సృష్టించింది. అయితే, స్పెయిన్ చారిత్రక విజయం కంటే అర్జెంటీనా వివాదాస్పద ప్రవర్తనే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Argentina
FIFA World Cup 2026
Spain vs Argentina Final
Lionel Messi
Football sportsmanship controversy
Rodri Golden Ball

More Telugu News