క్రికెటర్ అయ్యుండి ఫుట్‌బాల్ పాఠాలా?.. షోయబ్ అక్తర్‌పై నెటిజన్ల సెటైర్లు!

Shoaib Akhtar trolled for giving football lessons being a cricketer
  • ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ షోలో పాల్గొన్న పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్
  • రొనాల్డో ఫుట్‌బాల్ చరిత్రలోనే అతిపెద్ద బ్రాండ్ అని వ్యాఖ్య
  • ఆటలో మాత్రం మెస్సీతో రొనాల్డోకు పోలికే లేదన్న మాజీ పేస‌ర్‌
  • అక్తర్ విశ్లేషణపై సోషల్ మీడియాలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ట్రోలింగ్
  • క్రికెటర్ అయ్యుండి ఫుట్‌బాల్ గురించి చెప్పడమేంటని విమర్శలు
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. క్రికెట్ పిచ్‌పై తన వేగంతో బ్యాటర్లను భయపెట్టిన అక్తర్, ఫుట్‌బాల్ ఆటకు సంబంధించి చేసిన విశ్లేషణ అత‌డిని విమర్శలపాలు చేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ సందర్భంగా ఓ టీవీ షోలో ప్యానలిస్ట్‌గా పాల్గొన్న అక్తర్.. స్టార్ ప్లేయర్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే, అత‌డి విశ్లేషణ ఫుట్‌బాల్ అభిమానులకు ఏమాత్రం రుచించలేదు.

వివరాల్లోకి వెళితే.. నిన్న‌ అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన 'ట్యాప్‌మ్యాడ్', పీటీవీ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో అక్తర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అత‌డు మాట్లాడుతూ.. ఫుట్‌బాల్ ప్రపంచంలో రొనాల్డో మార్కెటింగ్ పరంగా అతిపెద్ద బ్రాండ్ అని అభిప్రాయపడ్డాడు. "ఫుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డో కంటే పెద్ద బ్రాండ్ మరొకటి లేదు. గత 10 ఏళ్లుగా ఫిఫా అతడి పేరును అమ్ముకుంది. ఎన్నో లీగ్‌లు అతడి ద్వారానే మార్కెటింగ్ చేసుకున్నాయి" అని అక్తర్ పేర్కొన్నాడు.

అదే సమయంలో ఆట విషయానికి వస్తే మెస్సీ ఉన్నత స్థాయిలో ఉన్నాడని, రొనాల్డో అతడి దరిదాపుల్లో కూడా లేడని స్పష్టం చేశాడు. "మెస్సీ ఆట మరో స్థాయిలో ఉంటుంది. మైదానంలో అతడి గురుత్వాకర్షణ శక్తిని చూడండి. కిందపడినా వెంటనే లేచి ముందుకు దూసుకెళతాడు. ఆట పరంగా మెస్సీతో రొనాల్డోకు అస్సలు పోలికే లేదు. రొనాల్డో కూడా అద్భుతమైన ఆటగాడే, కానీ మెస్సీ వేరు" అని వివరించాడు.

అయితే, ఓ క్రికెటర్ అయ్యుండి ఫుట్‌బాల్ గురించి విశ్లేషణ చేయడం, అందులోనూ మెస్సీ, రొనాల్డో లాంటి దిగ్గజాలపై భిన్నమైన అభిప్రాయాలు చెప్పడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. "క్రికెట్ గురించి మాట్లాడాల్సిన వ్యక్తి ఫుట్‌బాల్ గురించి పాఠాలు చెప్పడమేంటి?" అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. అక్తర్ అభిప్రాయాలను ఎగతాళి చేస్తూ మీమ్స్, కామెంట్లతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement
Shoaib Akhtar
Cristiano Ronaldo
Lionel Messi
FIFA World Cup 2026
Football Analysis
Social Media Trolling

More Telugu News