Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
- ఇంద్రకీలాద్రిలో బడ్జెట్ ప్రతులకు వేద పండితులతో పూజలు
- బడ్జెట్ రూ. 3.50 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కనకదుర్గమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులను అమ్మవారి పాదాల చెంత ఉంచి వేద పండితులతో పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి బడ్జెట్ విజయవంతం కావాలని ఆశీర్వదించారు.
ఆ తర్వాత, బడ్జెట్ ప్రతులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు అందజేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో ఈ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్నారు.
ఈ బడ్జెట్ సుమారు రూ.3.46 లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బడ్జెట్ ప్రజలందరికీ మేలు చేకూర్చాలని అధికారులు అమ్మవారిని ప్రార్థించడం గమనార్హం.