Jahnavi Kandula: అమెరికాలో మృతి చెందిన కర్నూలు యువతి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula Death Seattle Pays 29 Million Settlement
  • 29 మిలియన్ డాలర్ల పరిహారం ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం
  • 2023 జనవరి 23న రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీకొని జాహ్నవి మృతి
  • సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల
అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మృతి చెందిన కర్నూలు అమ్మాయి జాహ్నవి కందుల(23) కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల భారీ పరిహారాన్ని ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మన భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లు. 2023 జనవరి 23న సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో ఆమె మృతి చెందారు.

ఈ మేరకు సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి కందుల మృతి చాలా బాధాకరమని, ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్తయినా ఉపశమనం లభిస్తుందని తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనిపై జాహ్నవి కుటుంబం నుంచి స్పందన రావాల్సి ఉంది. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేశాయి.

జాహ్నవి సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ కోసం 2021లో అమెరికా వెళ్లారు. 2023లో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనం వేగ పరిమితి 40 కిలోమీటర్లుగా ఉండగా, పోలీసు అధికారి 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపాడు. దీంతో జాహ్నవి 100 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు.

ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి జాహ్నవి మృతిపై నాడు జోకులు వేయడం వివాదాస్పదమైంది. "ఆమె చనిపోయింది. చాలా మామూలు మనిషి. 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది" అంటూ నవ్వాడు. ఈ వ్యాఖ్యలపై నాడు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికాలోనూ ఆయన తీరుపై వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ అధికారిని విధుల నుంచి తొలగించారు.
Jahnavi Kandula
Seattle
Kurnool
police accident
wrongful death lawsuit
compensation

More Telugu News