Rubel Nagi: రూ.9 కోట్ల బహుమతి గెలుచుకున్న భారత టీచర్.. ఎవరీ రూబెల్ నాగి?

Rubel Nagi wins Global Teacher Prize 2026
  • ప్రతిష్ఠాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్-2026 గెలుచుకున్న ముంబై టీచర్ రూబెల్ నాగి
  • దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో అవార్డు ప్రదానం
  • మురికివాడలు, గ్రామాల్లో కళల ద్వారా విద్యను అందించినందుకు గుర్తింపు
  • మిసాల్ ఇండియా, రూబెల్ నాగి ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పిల్లల జీవితాల్లో వెలుగులు
భారతదేశానికి చెందిన ఆర్ట్, సోషల్ సైన్స్ టీచర్ రూబెల్ నాగి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్-2026ను గెలుచుకుని ప్రపంచ వేదికపై దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, జెమ్స్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును, దాంతో పాటు మిలియన్ డాలర్ల (సుమారు రూ.9 కోట్లు) ప్రైజ్ మనీని అందుకున్నారు.

ముంబైకి చెందిన రూబెల్ నాగి, ఇండియాలోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు విద్యను చేరువ చేయడానికి చేసిన విశేష కృషికి ఈ గౌరవం దక్కింది. ఆమె తన "మిసాల్ ఇండియా", "రూబెల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్" ద్వారా కళను ఒక మాధ్యమంగా ఉపయోగించి పిల్లలకు చదువుపై ఆసక్తిని పెంచుతున్నారు. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం గత 20 ఏళ్లలో ఆమె సుమారు 800కు పైగా లెర్నింగ్ సెంటర్‌లను స్థాపించారు. 600 మంది వాలంటీర్లు, ఉపాధ్యాయుల సాయంతో పాథశాలకు దూరంగా ఉన్న ఎందరో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.

ఆమె విద్యా విధానం చాలా ప్రత్యేకం. నాలుగు గోడల మధ్యే కాకుండా పరిసరాల్లోని గోడల మీద పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలు (లివింగ్ వాల్స్ ఆఫ్ లెర్నింగ్) గీసి వాటినే పాఠ్యపుస్తకాలుగా మారుస్తున్నారు. చదువుతో పాటు జీవన నైపుణ్యాలు, వృత్తి విద్య, సృజనాత్మకతను ప్రోత్సహించడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు.

ఈ పురస్కారంపై రూబెల్ నాగి స్పందిస్తూ... "ఈ అవార్డు నాకు మరింత ముందుకు వెళ్లేందుకు ప్రేరణనిస్తుంది. మరింత మంది పిల్లలకు చేరువయ్యేందుకు, అడ్డంకులను అధిగమించి ప్రతి విద్యార్థి విద్యను పొందేలా చూసేందుకు ఇది దోహదపడుతుంది" అని గతంలో పేర్కొన్నారు. వర్కీ ఫౌండేషన్, యునెస్కో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా నామినేషన్లు రావడం విశేషం.
Rubel Nagi
Global Teacher Prize 2026
Indian teacher
Mumbai teacher
Misaal India
education
social science
children education
Sunny Varkey
UNESCO

More Telugu News