Nara Lokesh: సింగపూర్ లో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను సందర్శించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Visits Microsoft Experience Center in Singapore
షార్ట్స్‌లో చూడండి
ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను సందర్శించింది. అక్కడ ఏఐ గోస్టోర్ లోని వివిధ పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎస్ఐ, తయారీ, వినియోగదారు పరిశ్రమల్లో ఎఐ వినియోగ దృశ్యాలను నారా లోకేశ్, ఏపీ అధికారులు పరిశీలించారు. 

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రత్యేకతలను వివరిస్తూ... వ్యాపారులు, వినియోగదారులు, ప్రేక్షకుల కోసం సంయుక్తంగా రిటైల్, ఎడ్యుకేషన్ మద్దతును అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్‌లు, పరిశ్రమ పరిష్కారాలను ఊహించడం, ఆవిష్కరణల వర్క్‌షాప్‌లు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్‌లు, క్లయింట్ల డిజిటల్ పరివర్తన మార్గాలపై దృష్టి సారించడం వరకు ఇక్కడ తమసేవలు విస్తరించినట్లు చెప్పారు. 

ముఖ్యంగా ఈ కేంద్రాలను ఐబీఎం, డెల్ వంటి కీలకమైన మైక్రోసాఫ్ట్ కస్టమర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ట్రాన్సఫర్మేషన్ కోసం ఉపయోగిస్తున్నాయని తెలిపారు. ఐబీఎం-మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ జోన్ ప్రత్యేకంగా క్లయింట్‌లకు అజ్యూర్, కోపైలట్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఏఐ ఆధారిత వ్యాపార పరిష్కారాలను చూపడంలో సహకరిస్తుందని చెప్పారు. అనంతరం ఎక్స్‌పీరియన్స్ సెంటర్ చాంబర్ లో మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మార్కస్ లోహ్, లీగల్ అఫైర్స్ హెడ్ జాస్మిన్ బేగం, సీటీఓ మార్క్ సౌజాలతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.

క్వాంటమ్ వ్యాలీలో హ్యాకథాన్ నిర్వహించండి

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... జనరేటివ్ ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొని సమన్వయం చేయడానికి ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ జోన్/టెక్నాలజీ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని కోరారు. భారతదేశంలోని అతిపెద్ద నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణుల సమూహాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి, అమెరికాలోని భారతీయ ఐటీ శ్రామిక శక్తిలో 25 శాతం కంటే ఎక్కువ మంది తెలుగు సమాజం నుండి వచ్చారు. 

అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లో అజ్యూర్ ఓపెన్‌ఏఐ సర్వీస్, మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ను ఉపయోగించి పరిష్కారాలను అన్వేషించడానికి మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యాన 2026లో హ్యాకథాన్‌ను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేయడానికి ఎపిలోని టాలెంట్ పూల్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.

ఇన్ఫినియన్ సెమీకండక్టర్స్ యూనిట్ సందర్శన

అనంతరం మంత్రి లోకేష్ బృందం ఇన్ఫినియన్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించింది. ఈ సందర్భంగా ఇన్ఫియన్ ప్రెసిడెంట్ & ఎండి సిఎస్ చువాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఎపిలో ఈఎంసిలు లేదా పారిశ్రామిక పార్కులలో సెమీ కండక్టర్స్ తయారీ (బ్యాక్ ఎండ్/ అసెంబ్లింగ్, టెస్టింగ్)కి అనుబంధంగా ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. పవర్ మాడ్యూల్స్, ఇన్వర్టర్లు, బీఎంఎస్ వ్యవస్థలను రూపొందించడానికి స్థానిక ఈవీ పర్యావరణ వ్యవస్థ ప్రధాన సంస్థలతో భాగస్వామ్యం వహించాలని సూచించారు. ఇంజనీర్లు, టెక్నీషియన్ల శిక్షణ కోసం సెమీ కండక్టర్ స్కిల్ అకాడమీ ఏర్పాటుచేయ్డడానికి ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సహకారం అందించాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తిచేశారు.

ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్కంతో మంత్రి లోకేశ్ భేటీ

ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్కంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ షాంగ్రీలా హోటల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ పరికరాల తయారీ కేంద్రం లేదా చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రాష్ట్ర పారిశ్రామిక క్లస్టర్‌లలో అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజా మాణిక్కం తెలిపారు.

డీటీడీఎస్ సీఈఓ చక్రవర్తితో భేటీ

డీటీడీఎస్ గ్రూప్ సీఈవో బీఎస్ చక్రవర్తితో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. డీటీడీఎస్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో ప్రాంతీయ సహకారాన్ని గుర్తించి తమిళనాడుతోపాటు ఏపీ సేవలను కూడా వినియోగించుకోవాలని కోరారు. 

క్యాపిటాల్యాండ్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో మంత్రి లోకేశ్  భేటీ

క్యాపిటాల్యాండ్ ఇన్వెస్టిమెంట్స్ (సీఎల్ఐ) సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... సీఎల్ఐ స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నందున విశాఖలోని డేటా సెంటర్‌లను వారి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తితో పూర్తిగా శక్తిమంతం చేయవచ్చని చెప్పారు. 

సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వైజాగ్ వంటి టైర్ 2 నగరాలకు తరలివస్తున్న నేపథ్యంలో వైజాగ్, విజయవాడలో ఐటీ/సాఫ్ట్‌వేర్ పార్కులు, మిశ్రమ అభివృద్ధి నమూనాల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక గిడ్డంగులు / పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయండి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీనిపై సంజీవ్ దాస్ గుప్తా స్పందిస్తూ... ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
Singapore
Microsoft Experience Center
Infineon Semiconductors
IVP Semi
Data Centers
IT Parks
Semiconductor Manufacturing
Skill Development

More Telugu News