సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్ లు
- రెండు కీలక డ్యామ్‌లలో సగానికి పడిపోయిన నీటి నిల్వలు
- సాగునీటి సంక్షోభం, ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం పడనుందని ఆందోళన
- భారత్ చర్య ఏకపక్షమని, చట్టవిరుద్ధమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విమర్శ
- ఉగ్రవాదంతో పాకిస్థానే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ గట్టి బదులు
ఈ పరిణామాలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన హిమానీనదాల పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, సింధు నదీ బేసిన్ నీటి పంపకాన్ని నియంత్రించే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా నిలిపివేసిందని ఆరోపించారు. సింధు నదీ వ్యవస్థ అథారిటీ (ఐఆర్ఎస్ఏ) తాజా అంచనాల ప్రకారం, పాకిస్థాన్ మొత్తం నీటి ప్రవాహంలో 21% కొరతను, రెండు కీలక డ్యామ్‌లలో దాదాపు 50% నీటి నిల్వల కొరతను ఎదుర్కొంటోంది. భారత్ నుంచి చీనాబ్ నది ప్రవాహాలు అకస్మాత్తుగా తగ్గడం వల్ల ఖరీఫ్ సీజన్ ఆరంభంలో నీటి కొరత మరింత పెరుగుతుందని ఐఆర్ఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే, సింధు జలాల ఒప్పందం ఉల్లంఘనకు తమను నిందించడం మానుకోవాలని భారత్ పాకిస్థాన్‌కు స్పష్టం చేసింది. తజికిస్థాన్‌లోని దుషాన్బేలో జరిగిన ఐక్యరాజ్యసమితి హిమానీనదాల సదస్సులో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. పాకిస్థానే ఉగ్రవాదం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. "ఈ వేదికను దుర్వినియోగం చేసి, సంబంధం లేని అంశాలను ప్రస్తావించడానికి పాకిస్థాన్ చేసిన ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము" అని ఆయన వ్యాఖ్యానించారు.