Advertisement

పార్లమెంట్‌లో గళమెత్తుతుంటే.. మోదీతో శరద్ పవార్ భేటీ: ఊహాగానాలకు తెరలేపిన కీలక సమావేశం!

Sharad Pawar meets Narendra Modi as Parliament protests spark political speculation
  • ప్రధాని కార్యాలయంలో మోదీతో శరద్ పవార్, సుప్రియా సూలే సమావేశం
  • పవార్‌ను ఆత్మీయంగా ఆహ్వానించిన మోదీ
  • ఎన్‌డీఏ కూటమిలో పవార్ పార్టీ చేరుతుందంటూ ఊహాగానాలు

ఒకవైపు నీట్ లీకేజీతో పాటు పలు అంశాలపై పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తుంటే... మరోవైపు ప్రధాని కార్యాలయంలో జరిగిన ఒక కీలక భేటీ దేశ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలేలు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  


ఈ భేటీకి సంబంధించిన ఫొటోల్లో ప్రధాని మోదీ స్వయంగా శరద్ పవార్‌ను చిరునవ్వుతో చేతిని పట్టుకుని ఆహ్వానించడం, ఇద్దరు నాయకులు ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ చర్చించుకోవడం కనిపించింది. రైతుల సమస్యలు, నీటిపారుదల రంగానికి సంబంధించిన పలు అంశాలపై పవార్ ప్రధానికి వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం.


ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మూడింట రెండొంతుల మెజారిటీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ పార్టీ మద్దతు ప్రభుత్వానికి చాలా కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా 50 శాతం సీట్ల పెంపుపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఇటీవలే సుప్రియా సూలే సంకేతాలు ఇచ్చారు.  


ఈ పరిణామాల మధ్య శరద్ పవార్ పార్టీ ఎన్‌డీఏ కూటమిలో చేరుతుందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే, మహారాష్ట్రలోని రెండు ఎన్సీపీ వర్గాలు (అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు) మళ్లీ విలీనమైతేనే ఎన్డీఏలో అధికారికంగా భాగస్వామ్యం కల్పిస్తామని, వ్యక్తిగతంగా లేదా విడివిడిగా చేర్చుకునే ఉద్దేశం లేదని బీజేపీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విపక్ష ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని తీవ్రతరం చేసిన సమయంలోనే, ఆ కూటమిలోని కీలక నేత శరద్ పవార్ ప్రధానితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Sharad Pawar
Narendra Modi
Supriya Sule
Delimitation Bill
NCP SP
Maharashtra Politics

More Telugu News