అధికారికంగా బిచ్చగాళ్లయ్యారు... పాక్‌ పై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు

Owaisi Sharp Remarks on Pakistan
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి, భారత్‌పై దాని దుందుడుకు చర్యల నేపథ్యంలో ఒవైసీ శనివారం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, "పాకిస్థాన్ ఇప్పుడు అధికారికంగా ఒక బిచ్చగాడి దేశంగా మారింది" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పాకిస్థాన్ ఒక బిలియన్ డాలర్ల రుణం కోరడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

"గత 75 ఏళ్లుగా ఏం చేశారు, ఈ దుస్థితికి రావడానికి కారణం ఎవరు? అయినా దురదృష్టవశాత్తూ ఐఎంఎఫ్ వారికి రుణం ఇస్తోంది. ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి కాదు, అంతర్జాతీయ మిలిటెంట్ ఫండ్" అని ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మన భూభాగం, మన సైనికులు, మన ప్రజలపై దాడులు జరుగుతున్నా అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాలు దీనికి ఎలా అంగీకరిస్తున్నాయి?" అని ఆయన ప్రశ్నించారు.

పాకిస్థాన్ అంతర్గత వైఫల్యాలను ఎత్తిచూపుతూ, "దేశాన్ని పాలించడం చేతకాదు, ఆర్థిక వ్యవస్థను నడపడం తెలియదు. ఇస్లాం గురించి మాట్లాడటం తప్ప వాళ్ల దగ్గర ఏమీ లేదు. భారత్‌లో హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికే ఈ వ్యూహాలు పన్నుతున్నారు" అని విమర్శించారు.

శత్రువుల దాడులను మన సైనికులు ధైర్యంగా తిప్పికొడుతున్నారని ప్రశంసించిన ఒవైసీ, "శ్రీనగర్‌ వరకు డ్రోన్లు వస్తున్నాయి. మన సైనికులు ఎంత ధైర్యంతో వాటిని ఎదుర్కొంటున్నారో ఊహించలేం. సరిహద్దు ప్రజలు కూడా ధైర్యంగా నిలబడుతున్నారు" అని అన్నారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు విభేదాలు పక్కనపెట్టి దేశం కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు.

పాకిస్థాన్ అణు సామర్థ్యం ప్రపంచానికి ప్రమాదకరమని, దాన్ని నిరాయుధీకరించాలని ప్రపంచ దేశాలను కోరారు. "ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలపై దాడి చేసేంత నీచస్థాయికి దిగజారారు. చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి ధైర్యంగా, ఐక్యంగా స్పందించాలి. వారి పతనం ఎంతో దూరంలో లేదు" అని ఒవైసీ పేర్కొన్నారు. దేశ సైన్యానికి అండగా నిలవాలని జాతీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Asaduddin Owaisi
Pakistan Economy
Pakistan Crisis
IMF Loan
India-Pakistan Relations
Owaisi on Pakistan
Pakistan's Nuclear Capability
Cross Border Terrorism
AIMIM
Hyderabad MP

More Telugu News